
ఆటపాటలతో గడిపేవాళ్లం
మంచిర్యాలటౌన్: మాది బీమారం గ్రామం. పుట్టి పెరిగింది అంతా అక్కడే అయినా మా అమ్మమ్మ వాళ్ల ఊరు భూపాలపల్లి జిల్లా దామరకుంట. వేసవి సెలవులు ప్రారంభం కాగానే అక్కడికే వెళ్లేవాళ్లం. మా అమ్మమ్మకు ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులున్నారు. పది కుటుంబాల పిల్లలమంతా అమ్మమ్మ వాళ్ల ఊరికే వచ్చేది. 25 మంది వరకు ఒక్కచోట చేరడంతో పండుగ వాతావరణం నెలకొనేది. మా కుటుంబ సభ్యులమంతా కలిసి చిర్రగోనె, గోలీలు, కోతికొమ్మచ్చి, కబడ్డీ అడేవాళ్లం. ఈత కొట్టేవాళ్లం. చింతచెట్ల కింద రకరకాల ఆటలు ఆడేది. మా అమ్మమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, మామయ్యలు, అత్తయ్యలు ఎన్నో కథలు చెప్పేవారు. ఆరుబయట కూర్చుని సరదా ముచ్చట్లు, కథలు, ఆటపాటలతో గడిపేవాళ్లం. – పోటు రవీందర్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి
ఆసిఫాబాద్‌అర్బన్: నేను రిటైర్డ్ తహసీల్దార్‌ను. మా సొంత గ్రామం సిర్పూర్(టి) మండలం లోనవెల్లి. మేము వేసవి సెలవుల కోసం ఎదురుచూస్తుండే వాళ్లం. వార్షిక పరీక్షలు ముగిసిన మరుసటి రోజే అమ్మమ్మ ఊరు ఆసిఫాబాద్‌కు చేరుకునే వాళ్లం. బంధువులందరితో కలిసి సరదాగా గడిపేవాళ్లం. అమ్మమ్మ కట్టెలపొయ్యిపై వండిన వంట ఎంతో మధురంగా ఉండేది. ఉద యం, సాయంత్రం పెద్దవాగు ఇసుకపై ఆడుకునేవాళ్లం. వాగులో స్నానాలు, పాత ఆలయాల్లో ఆటలకు వెళ్తే సెలవులు తొందరగా గడిచిపోయేవి. సెలవుల తర్వాత ఇంటికి వెళ్లాలంటే ఏడుపొచ్చేది. అప్పటి మధుర జ్ఞాపకాలు జీవితంలో మరువలేం. – మాసాదె శివ్‌రావ్, లోన్‌వెల్లి
మంచిర్యాలటౌన్: మాది కాగజ్‌నగర్. వేసవి సెలవులు వస్తే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామంలోని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లేది. మేము నలుగురు ఆడపిల్లలం కాగా నేనే పెద్దదాన్ని. అంతా అమ్మమ్మ ఊరిలోనే గడిపేవాళ్లం. కోతికొమ్మచ్చి, అష్టాచెమ్మా, కై లాసం, దాగుడు మూతలు, మోటబావుల్లో ఈత కొట్టడం ఇలా సరదాగా గడిపేవాళ్లం. రాత్రి ఆరుబయట మా అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రించేవాళ్లం. చిన్నప్పుడే కరాటే నేర్చుకున్నాను. నెలన్నరకుపైగా వేసవి సెలవులు ఇస్తే వేగంగా గడిచిపోయేవి. అమ్మమ్మ చెప్పిన కథలు నేటికీ మర్చిపోలేను.
– నీరటి రాజేశ్వరి, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల
కథలు వింటూ నిద్రపోయేది

ఆటపాటలతో గడిపేవాళ్లం

ఆటపాటలతో గడిపేవాళ్లం