ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్‌పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం..
ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్‌కు రాయితీలు ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.
ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.
ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.
అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.
మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలి
యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్‌నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్‌లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి.
ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.
ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్‌ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.
అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది.


