ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి | US moves cargo planes carrying ammunition to Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి

May 18 2026 3:57 PM | Updated on May 18 2026 4:12 PM

US moves cargo planes carrying ammunition to Israel

టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.

ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.

యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్‌ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.

చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.

దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.

Advertisement
 
Advertisement
Advertisement