మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ | joint press statement with PM Modi Italian PM Giorgia | Sakshi
Sakshi News home page

మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ

May 20 2026 6:15 PM | Updated on May 20 2026 6:51 PM

joint press statement with PM Modi Italian PM Giorgia

రోమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.

‘‘గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మెలోనీని ఎన్నోసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఇది భారత్-ఇటలీ మధ్య ఉన్న నిరంతర సహకార బంధాన‍్ని ప్రతిబింబిస్తోంది. భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 మా భాగస్వామ్యానికి ఆచరణాత్మక, విజన్‌ ఉన్న రూపాన్ని ఇస్తోంది. 

దీనిపై సమయపాలనతో ముందుకు సాగుతున్నాం. మా రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వెళ్తోంది. భారత్‌లో ఉన్న 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి” అని ప్రధాని మోదీ తెలిపారు.

సంయుక్త మీడియా సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాట్లాడుతూ.. “ఈ రోజు రోమ్‌లో మా సత్సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ స్థాయికి మరింత బలపరుస్తున్నాం. ఇది రెండు దేశాల సంబంధాల్లో ఇప్పటివరకు చేరిన అత్యున్నత స్థాయి. ఇప్పుడు ఇటలీ-భారత్ గతంలో ఎప్పుడూ లేనంత దగ్గరయ్యాయని చెప్పొచ్చు. 

మా సంబంధాలు పూర్తి సామర్థ్యాన్ని చూపగల స్థాయికి చేరుకున్నాయి. గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మోదీతో నేను ఏడు  సమావేశాలు నిర్వహించాను. ఆ సమయంలో ఒకరినొకరం, మా అభిప్రాయాలను లోతుగా తెలుసుకున్నాం. గౌరవం, పరస్పర నమ్మకంపై నిలిచిన నిజాయితీ స్నేహాన్ని కూడా నిర్మించుకున్నాం. ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ చూసి ఆయన దూరదృష్టి, ఆచరణాత్మకత, నాయకత్వాన్ని నేను వ్యక్తిగతంగా మెచ్చుకున్నాను. మా స్నేహం వేగంగా కలిసి పనిచేయడంలో ఎంతో సహాయపడింది” అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement