పాక్ అనాగరిక చర్యలను కడిగేసిన భారత్ | India Slams Pakistan at UNSC Over Brutal Airstrikes and Genocidal Record | Sakshi
Sakshi News home page

పాక్ అనాగరిక చర్యలను కడిగేసిన భారత్

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

India Slams Pakistan at UNSC Over Brutal Airstrikes and Genocidal Record

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) వేదికగా భారత్ పొరుగుదేశమైన పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పౌరుల సామూహిక హత్యలు, సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ చరిత్ర మొత్తం రక్తసిక్తమయమేనని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన అనాగరిక దాడులను ప్రపంచం ముందు పెట్టారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.

కాబూల్ ఆస్పత్రిపై పాశవిక దాడి
సరిహద్దుల్లో పాకిస్తాన్ సృష్టిస్తున్న సాయుధ హింస కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 750 మంది పౌరులు మరణించడం లేదా గాయపడటం జరిగిందని పలు నివేదికలను ఉదహరిస్తూ హరీష్ పర్వతనేని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో పవిత్ర రంజాన్ మాసంలో, ప్రజలంతా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న సమయంలో కాబూల్‌లోని ‘ఓమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్’ పై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ అత్యంత క్రూరమైన, అనాగరిక దాడిలో 269 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. సైనిక లక్ష్యం కాని ఒక వైద్యశాలపై దాడి చేయడాన్ని ఏ రకంగానూ సమర్థించుకోలేమని భారత్ తేల్చిచెప్పింది.

అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన
ఆఫ్ఘన్ పౌరులను రక్షించాలన్న అంతర్జాతీయ పిలుపులను, మానవతా నిబంధనలను పాకిస్తాన్ పూర్తిగా కాలరాసిందని భారత్ ఆరోపించింది. చీకటి పడ్డాక అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనమని పర్వతనేని మండిపడ్డారు. పౌరుల రక్షణకు సంబంధించిన 'నాన్-రిఫౌల్‌మెంట్' సూత్రాన్ని పాటించాలని ‘సమితి’ సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తిని కూడా పాకిస్తాన్ బేఖాతరు చేసిందని ఆయన విమర్శించారు. పౌర నష్టాలకు కారణమైన 95 సంఘటనలలో 94 ఘటనలకు పాక్ భద్రతా దళాలే బాధ్యులని సమితి సహాయక మిషన్ నిర్ధారించిందని గుర్తుచేశారు.

సొంత ప్రజలనే బాంబులతో చంపే దేశం
పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, సరిహద్దు వెంబడి అది సాగిస్తున్న హింస కారణంగా 94,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను అంతర్జాతీయ సమాజం తప్పకుండా జవాబుదారీ చేయాలని డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా

Advertisement
 
Advertisement
Advertisement