భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా | Kerala Family Faces Australia Deportation Threat Over Son's Condition | Sakshi
Sakshi News home page

భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా

May 21 2026 9:33 AM | Updated on May 21 2026 9:33 AM

Kerala Family Faces Australia Deportation Threat Over Son's Condition

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో స్థిరపడాలనే ఆశతో వెళ్లిన ఓ భారతీయ కుటుంబానికి అక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. తమ ఆరేళ్ల కుమారుడికి ఉన్న శారీరక ఎదుగుదల లోపాన్ని కారణంగా చూపిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ కుటుంబానికి పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్‌) నిరాకరించింది. అంతటితో ఆగకుండా, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమైంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం విక్టోరియాలోని బెండిగో నగరంలో తీవ్ర ఆందోళనతో కాలం వెళ్లదీస్తోంది.

కన్నీరు పెట్టిస్తున్న విసా తిరస్కరణ 
ఈ కుటుంబానికి చెందిన క్రిస్టిన్ దాస్ విక్టోరియాలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో రిజిస్టర్డ్ నర్సుగా సేవలందిస్తున్నారు. ఆమె భర్త జినీష్ జోసెఫ్ క్వాలిఫైడ్ చెఫ్, అలాగే కొడుకు బాగోగులు చూసుకునే పూర్తి స్థాయి కేర్‌గివర్‌గా ఉన్నారు. వీరికి జాజియల్ (6), హేజెల్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్టోరియాలో ఎమర్జెన్సీ కేర్, హాస్పిటాలిటీ రంగాలలో సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ, కొడుకు అనారోగ్యాన్ని సాకుగా చూపి వీసా నిరాకరించడంపై వారు తీవ్రంగా కలత చెందుతున్నారు.

ఐర్లాండ్ వదిలి వస్తే నడిరోడ్డుపైనేనా? 
గతంలో ఈ కుటుంబం ఐర్లాండ్‌లో ఉండేది. ఆస్ట్రేలియా వీసా లభించడంతోనే వారు అక్కడి నుంచి ఇక్కడికి తరలివచ్చారు. వీసా దరఖాస్తు ప్రక్రియలోనే తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తాము స్పష్టంగా తెలియజేశామని వారు చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే వీసా తిరస్కరించి ఉంటే, తాము ఐర్లాండ్‌లోనే ఉండేవారమని, ఇప్పుడు ఇక్కడ అన్నీ సెట్‌ చేసుకున్నాక నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తమ కుమారునికి అందుతున్న వైద్య సహాయం ఆగిపోతే, వాడి భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

న్యాయం కోసం డిజిటల్ పోరాటం 
తమకు జరుగుతున్న అన్యాయంపై ఈ కేరళ కుటుంబం 'Change.org' వేదికగా డిజిటల్ పిటిషన్ వేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమను దేశం నుంచి బహిష్కరించకుండా నిలిపివేయాలని, మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని వారు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ పిటిషన్‌కు ఆస్ట్రేలియా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 7,000 మందికి పైగా దీనిపై సంతకాలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ‘మా పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. ఇదే వారి ఇల్లు... మమ్మల్ని వెళ్లగొడితే మా బాబుకు భవిష్యత్తు ఉండదు’ అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న అభ్యర్థన నెటిజన్లను కదిలిస్తోంది.

ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు

Advertisement
 
Advertisement
Advertisement