డిజిటల్‌ భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ మెగా ప్లాన్‌ | Microsoft To Build India’s Biggest AI Data Center In Hyderabad, Massive Investment Push For Cloud Expansion | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ మెగా ప్లాన్‌

May 20 2026 8:23 AM | Updated on May 20 2026 11:14 AM

India Largest Data Center by Microsoft Hyderabad Leads Digital Bharat

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి భారీ ఊపునిచ్చేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తన అత్యంత భారీ డేటా సెంటర్‌ను 2026లోనే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. టెక్నాలజీ హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌ నగరంలోనే ఈ సదుపాయం ఏర్పాటు కాబోతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ నిర్మించబోయే అత్యంత భారీ, వ్యూహాత్మక డేటా సెంటర్ కానుంది.

క్లౌడ్, ఏఐ సేవలకు భారీ డిమాండ్

భారత్‌లో మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణపై పునీత్ చందోక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో అజూర్ క్లౌడ్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉంది. దీనితో పాటు నెలకు 30 డాలర్ల ధర కలిగిన కంపెనీ ప్రతిష్టాత్మక ‘కోపైలట్ 365 ఏఐ అసిస్టెంట్’ వినియోగం భారత్‌లో శరవేగంగా పుంజుకుంటోంది’ అని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి భారీ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తన ఏఐ పురోగతిని మరింత బలోపేతం చేస్తోంది. కాగా, మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్‌లు సైతం భారతీయ ఏఐ, క్లౌడ్ మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తుండటం గమనార్హం.

వేల కోట్ల పెట్టుబడి

భారత మార్కెట్‌పై మైక్రోసాఫ్ట్ నమ్మకానికి ఇక్కడి పెట్టుబడులే నిదర్శనం. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తున్న 17.5 బిలియన్ డాలర్లను భారతదేశంలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివర్లో ప్రకటించింది. ఇది 2025లో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల వాగ్దానానికి అదనపు పెట్టుబడి కావడం విశేషం. ఈ భారీ నిధుల్లో సింహభాగం హైదరాబాద్ ఫెసిలిటీతో కూడిన డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తరణకే మళ్లించనున్నారు. డేటా సెంటర్ నిర్మాణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. తమ ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా, అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని చందోక్ స్పష్టం చేశారు. అయితే, రాబోయే ఈ సదుపాయం కచ్చితమైన సామర్థ్యం ఎంత అనే వివరాలను ఆయన ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!

Advertisement
 
Advertisement
Advertisement