అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్‌పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్‌షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్‌తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.
RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?
అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్‌విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్‌వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అలీబాబా కొత్త ఏఐ చిప్
ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. జెన్వు సిరీస్‌లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్‌లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!


