అల్లూరి జిల్లా: తనను తాను పాస్టర్ అని చెప్పుకున్న అభినయ్‌పై దాడి కేసులో ఎస్పీ అమిత్ బర్దర్ కీలక విషయాలు వెల్లడించారు. బుధవారం అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు.
‘‘అభినయ్ పాస్టర్ కాదు. అతడిపై ఎవరూ దాడి చేయలేదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలనేది ఆయన ఉద్దేశం. దాడి పేరుతో సానుభూతి పొందాలనేది అభినయ్ ఆలోచన. ఆయన సినిమా యాక్టర్ కావడంతో సినిమా తరహాలో దాడి జరిగినట్లు ప్లాన్ సిద్ధం చేశారు. గతంలో కూడా ఆయనపై అనేక కేసులు నమోదయి ఉన్నాయి.
హాస్పిటల్ కు రాకముందే సోషల్ మీడియాలో అభినయ్ వీడియోలు వైరల్ అయ్యాయి. గూడెం కొత్త వీధి పీఎస్‌లో BNS సెక్షన్లు 189(3), 196(2), 299, 3(5), 302, 353(1) కింద కేసు నమోదు చేశాము. కుట్రలో పాల్గొన్న నిందితుల పేర్లు.. దారా అభినయ దర్శన్, కిరణ్ జార్జ్, కె.బెన్‌హర్, భాను ప్రసాద్. దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తంగుల వసంత్ కుమార్, కుమాడ ప్రేమ్‌కుమార్, తంగుల సత్యరాజు, కిండంగి ఇంద్ర కుమార్’’అని తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాలలాగే తనను కూడా చంపాలనుకుంటున్నారని అభినయ్ మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. తనకు పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను అరెస్టు చేశారని చెప్పారు. కాగా, పోలీసుల దర్యాప్తులో ఆయన నాటకాలన్నీ బయటపడ్డాయి.


