పవన్‌ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..? | Janasena Posts Sale Allegations On Balineni Praneeth Reddy Trigger Political Storm, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పవన్‌ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?

May 20 2026 12:09 PM | Updated on May 20 2026 12:35 PM

Janasena Posts Sale Allegations Balineni Praneeth Reddy

ఉమ్మడి జిల్లా కూటమిలో కుంపట్లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పేరుకే జనసేనలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెర వెనక ఆట ఆడిస్తున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలిసిన 24 గంటలు గడవకముందే జనసేన నాయకుడు ఆరోపణలు గుప్పించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణల వెనుక టీడీపీ ముఖ్యనేత హస్తం ఉందని బాలినేని వర్గం ఆరోపణలు చేస్తోంది.  

సాక్షి ప్రకాశం : జిల్లా కూటమిలో వర్గ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. జనసేన ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోవడం తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆరు జిల్లాల డీ లిమిటేషన్‌ సమావేశం బాధ్యతలు అప్పగించడంతో అటు జనసేనలోనే కాకుండా ఇటు టీడీపీలో కూడా అలజడి రేగుతోంది. ఆ సమావేశానికి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ వర్గం గైర్హాజరవడం ద్వారా బాలినేని ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది. బాలినేని ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంతో ఆందోళనకు పచ్చనేతలు జడా బాల నాగేంద్రం ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేయించిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలు పోటా పోటీగా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో జిల్లా కూటమి నాయకులు ఎండలకు మించి ఉక్కపోతకు గురవుతున్నారు. 

అధిష్టానాన్ని లెక్క చేయకుండా.... 
స్థానిక సంస్థల డీ లిమిటేషన్‌ సమావేశం బాధ్యతలను బాలినేనికి అప్పగించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమావేశం ఒంగోలులో నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ అండ్‌ కో ఆ సమావేశాన్ని బాయ్‌ కాట్‌ చేశారు. తమకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన డీ లిమిటేషన్‌ సమావేశాన్ని స్వయంగా జిల్లా అధ్యక్షుడే బాయ్‌ కాట్‌ చేసినప్పటికీ జనసేన అధిష్టానం ఏమీ చేయలేక పోయింది. దీంతో పారీ్టపై జనసేన అధిష్టానం పట్టు కోల్పోయిందన్న విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులతో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై రియాజ్‌ వర్గం రగిలిపోతున్నట్లు సమాచారం.  

సీఎం చంద్రబాబును కలిశాక... 
ఒకవైపు జిల్లా కూటమిలో టీడీపీ, జనసేనలోని వర్గాలు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే బాలినేని కలవడం పచ్చశిబిరంలో అలజడి రేపింది. దీంతో బాలినేనికి చెక్‌ పెట్టకపోతే ఇక లాభం లేదని భావించిన ఆ వర్గం వ్యూహాత్మకంగా జడా బాల నాగేంద్రంను రంగంలోకి దింపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల నాగేంద్రం మొదట్నుంచి బాలినేని ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే దామచర్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన డీ లిమిటేషన్‌ సమావేశంలో కూడా బాలినేని వెంట ఉన్న బాల నాగేంద్రం ఉన్నట్టుండి ఆయనపైనే ఆరోపణలు చేయడంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.  

బాలినేని వర్గం ప్రతి విమర్శలు... 
ఉదయం బాల నాగేంద్రం బాలినేని మీద విమర్శలు గుప్పించారు. సాయంత్రం అయ్యేసరికల్లా బాలినేని వర్గం ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రతి విమర్శలు చేసింది. ఇతర పార్టీ నాయకులు తెర వెనక ఉండి బాలినేని మీద విమర్శలు చేయిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఎం చంద్రబాబుతో కలిసి జిల్లా పరిస్థితులు చర్చించిన విషయం బయటకు వచ్చిన వెంటనే కొందరు నాయకులు బాలినేని మీద తప్పుడు ఆరోపణలతో ప్రెస్‌ మీట్‌ పెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. నాగేంద్రం వెనక ఉన్న వ్యక్తి ఏమీ పీకలేరని ఆమె విరుచుకుపడ్డారు. ఇతర పారీ్టల నాయకులు జనసేనపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు.  

ఇరు పార్టీల అధినేతలు మౌనం... 
జిల్లాలో కూటమి పారీ్టల్లో ఎత్తులు, పై ఎత్తులతో స్థానిక నాయకులు తరచూ వీధిన పడుతున్నారు. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల నేరుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాలినేనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయినా టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొదట రియాజ్, అరుణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అరుణను వెంటాడి మరీ దాడి చేసినా పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలినేని కార్యక్రమాలను రియాజ్‌ అండ్‌ కో బాయ్‌ కాట్‌ చేసింది. అయినా సరే జనసేన అధినేత పట్టించుకోవడం లేదు. ఇరు పారీ్టల అధినేతల మౌనం వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.  

పదవులు అమ్ముకుంటున్న బాలినేని...
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్‌ రెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని జడా బాల నాగేంద్రం చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌ తాల్లూరి, లింగమనేని రమేష్‌ లతో కుమ్మక్కై పదవులు అమ్ముకుంటున్నారని బాల నాగేంద్రం విమర్శలు చేయడం గమనార్హం. నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రూ.10 లక్షలు, జిల్లా అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తామంటూ ఎన్‌ఆర్‌ఐలకు ఫోన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో, ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని, ఆయన కుమారుడ్ని దూరంగా పెట్టాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్‌ మీట్‌ వెనక అధికార పార్టీకి చెందిన కీలకనేత వర్గం హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement