సాక్షి, ప్రకాశం: దర్శి ఎస్సై మురళి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రైవేటు సెటిల్‌మెంట్‌లకు పోలీస్ స్టేషన్‌ను అడ్డాగా మార్చారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులను నిత్యం పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి వారికి సకల మర్యాదలు చేస్తూ వారు చెప్పిందే వేదంలా పని చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపుపై సోమవారం దర్శిపట్టణంలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఆందోళనకు ఆటోలు ఇచ్చారంటూ రెండు ఆటోల అద్దాలను పగులగొట్టడం వివాదాస్పదంగా మారింది.
ఆది నుంచీ వివాదాస్పదమే..
టీడీపీ నేతలతో క్రికెట్ బెట్టింగ్‌లను వేయించి వాటిని ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్‌ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్న వారిని పిలిపించి కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దర్శికి ప్రత్యేక టీంను పంపి క్రికెట్ బెట్టింగ్‌లు వేసే టీంను పట్టుకున్నారు. అయితే అందులో ప్రధాన నిందితులు టీడీపీకి చెందిన వారే కావడంతో ఈ ఎస్సై, సీఐలు వారిని దేశం దాటించారన్న అనుమానాలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే వ్యక్తమయ్యాయి. దీంతో ఎస్సైని కొన్ని రోజులు విధుల నుంచి పక్కన పెట్టి ఇక్కడ ఇన్‌చార్జ్ ఎస్సైని కూడా నియమించారు.
పారిపోయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను ఇప్పటికీ పట్టుకున్న పాపానపోలేదు. బొద్దుకూరపాడు, ఎర్రోబనపల్లి, చలివేంద్ర కొండ శివారుల్లో పెద్ద మొత్తంలో పేకాట శిబిరాలు నిర్వహించి సీఐతో కలిసి భారీ మొత్తంలో నెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్శి నుంచి వెళ్లే అక్రమ ఇసుక, అక్రమ రేషన్ బియ్యం తరలింపును ప్రోత్సహిస్తూ వారి వద్ద భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు చెల్లించి తెచ్చుకునే వారి ఇసుక లారీని గొట్టిపాటి లక్ష్మి ప్రధాన అనుచరులు ధ్వంసం చేయగా సంబంధిత యజమాని ఫిర్యాదు చేయడంతో కేసు కట్టారు. ఆ తరువాత ఆ ఎఫ్‌ఐఆర్ ను మాయం చేసి యజమానిని బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఎఫ్‌ఐఆర్ స్థానంలో మరో కేసు కట్టినట్లు సమాచారం. ఇది ఒక ఎత్తైయితే వైఎస్సార్ సీపీ నేతలు ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పుడు దురుసుగా ప్రవర్తించడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెడతామని బెదిరించడం తరుచూ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఫ్లెక్సీలు కట్టుకున్నా వివాదాలు సృష్టించి వారిపై కేసులు పెడతామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారని తెలిసింది. గతంలో గణేష్ నిమజ్జనాన్ని కూడా రాజకీయం చేసి చలివేంద్రలో గ్రామస్తుల ఇళ్లపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా వారిని లాఠీతో చావబాదారు.
అర్ధరాత్రి వరకు మహిళలను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి ఆ తరువాత ఇంటికి పంపారు. అయినా ఈ ఎస్సై పై అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం, ఫ్లెక్సీలు కట్టేవాళ్లను బెదిరించడం, ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీలు కడితే టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్రమ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి చావబాదడం చేస్తున్న ఎస్సై తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల బొట్లపాలెం గ్రామంలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలను కొట్టగా వైఎస్సార్ సీపీ నేత పైనే కేసులు పెట్టి గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించి భయబ్రాంతులకు గురి చేశారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో డీజే సౌడ్‌తో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలు చేశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు.
గొట్టిపాటికి దాసోహం:
టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మీకి దాసోహం చేయడానికే పోలీస్ ఉద్యోగంలో చేరారన్నట్లు వ్యవహరిస్తున్న ఈ ఎస్సై తీరు వివాదాస్పదంగా మారింది. మండలంలో ఆమె ఎక్కడికి వెళితే అక్కడకు కాన్వాయ్ పెట్టుకుని ఈ ఎస్సై ప్రత్యక్షమవుతారు. ఆమె బర్త్‌డే పారీ్టలకు, ఆమె చేస్తున్న ప్రైవేటు కార్యక్రమాలకు స్టేషన్‌లో డ్యూటీ కూడా మానుకుని ఆమె వెంటే పోలీస్ జీపుతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా కాన్వాయ్‌గా తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని టీడీపీ ఇన్‌చార్జ్ అయిన ఆమె కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ దర్శికి వస్తున్నారంటే పోలీస్ కాన్వాయ్ పెట్టి ఆమె వెంట ఉండి తీసుకొస్తారు. టీడీపీ కార్యక్రమాలను దగ్గరుండి ఆమెకు సెక్యూరిటీ ఇస్తుంటారు. ప్రభుత్వ వాహనాలతో ప్రైవేటు వ్యక్తులకు సెక్యూరిటీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


