Youth activists
-
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్‌లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్‌ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్‌లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్‌లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్‌ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్‌ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్‌పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్‌ఫామ్‌ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హోదా కోసం కదం తొక్కిన యువత
సాక్షి, కాకినాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కాకినాడలో కదం తొక్కారు. ప్రత్యేక హోదా, విభజన సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వారు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ను , వైజాగ్ చెన్నై కారిడార్లను వెంటనే మొదలు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వ రంగంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, రామయ్యపట్నం పోర్టు కట్టాలని, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని వారు నినాదాలు చేశారు. మోదీ దేశ ప్రధానిగా వ్యహరించాలే తప్ప గుజరాత్ ప్రధానిగా వ్యవహరించడం తగదని ఆందోళనకారులు అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్ల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపడం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా పోవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయాలే కారణమంటూ పలువురు విమర్శించారు. జేఈఈ పరీక్షలు తెలుగు, తమిళంలో నిర్వహించకుండా గుజరాతీలో నిర్వహించడాన్ని మోదీ ఆయన అనుచరులు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. గోదావరి నదీ జలాల మళ్లింపుపై వెంటనే అఖిల పక్షం వేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు కోసం రాయితీతో కూడిన హోదా అవసరం హోదా, విభజన సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాయితీతో కూడిన హోదా అవసరమన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకుడు అద్వానీ మారలేదా? తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదా, రైల్వే జోన్ సాధ్యం కాదన్న వారు రైల్వే జోన్ మంజూరు చేయలేదా? అని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతుంటే కేంద్ర నాయకులు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు. ‘ప్రధాని మోదీ, అమిత్‌షాలు గొప్ప అంటూ గుజరాతీ పాటలు పాడుకుంటుంటే వారి ఇష్టం. కానీ ఏపీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు మాట్లాడడం భావ్యం కాద’న్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అనేక పథకాలు అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలి, సహాయం చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం ప్రయత్నించడం సరికాదని శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్‌ను వెంటనే మోదీని ఢీకొనమని తాము అనబోమన్నారు. కొంత సమయం ఇవ్వండి. అప్పుడు కూడా కేంద్రం ఏపీపై కక్ష సాధింపులు మానకపోతే, అందరూ కలసి పోరాడదాం అని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశానికి రాష్ట్ర విద్యార్థి యువజన నేతలు పి. బులిరాజు, పెంకే రవితేజ, సిద్ధార్థ సందీప్ చిట్టిబాబు, ఆసీఫ్ జాన్, భరత్ పాల్గొన్నారు. -
‘అంగన్వాడీ’ల అవస్థలు
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కనీస వేతనాలందక అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. వెట్టిచాకిరి చేస్తున్నా పాలకులు స్పందించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణే గాక ప్రభుత్వం ఇతర పనులను సైతం వీరితోనే చేయిస్తోంది. పనిగంటలు, బాధ్యతలు పెరిగినా ఆ మేరకు జీతాలు పెరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత చాకిరి చేస్తున్నా అంగన్వాడీ కార్యకర్తకు కేవలం రూ.3,700, ఆయాకు రూ.1,950 చొప్పున నామమాత్రపు జీతాలను చెల్లిస్తుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రీస్కూల్ నడిపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అందోళనబాట పట్టిన కార్యకర్తలు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం రూ.10,000 చెల్లించాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రతి కేంద్రానికి సొంతభవనాన్ని సమకూర్చాలని, సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మూతపడిన కేంద్రాలు.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గత రెండు రోజులుగా ఆందోళనబాట పట్టడంతో ఆయా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. -
పోలీస్ మార్క్ ట్రీట్మెంట్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఖమ్మం అర్బన్ పోలీసులు రెచ్చిపోయారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది చాలదన్నట్లు హత్య కేసులో నిందితుల మాదిరిగా నడిరోడ్డుపై గొలుసులతో భారీ బందోబస్తు మధ్య ప్రదాన రహదారిపై ప్రదర్శనగా కోర్టుకు తీసుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. గతనెలలో ఖానాపురం హవేలీ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న యువకులను స్థానికులు మందలించారు. దీంతో యువకులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. అనంతరం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో కలిసి వచ్చి స్థానికులపై దాడి చేయడంతో స్థానికులు సైతం వారిపై దాడి చేశారు. అనంతరం స్థానికులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు యువకులు నేరుగా కోర్టులో లొంగిపోయారు. పోలీసులు వీరిని విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయి గురువారం ఆ యువకులను గొలుసులతో బంధించి సినీఫక్కీలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పోలీసుల తీరును చూసిన స్థానికులు అవాక్కయ్యారు. తీవ్రమైన కేసుల్లో మాత్రమే ఇలా వ్యవహరించే పోలీసులు చిన్నపాటి ఘర్షణ కేసులో నిందితులైన ఇద్దరు యువకుల పట్ల ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ విచారణ కోసం... ఖమ్మం అర్బన్ : శ్రీనగర్ కాలనీలో గత నెల 20వ తేదీన జరిగిన ఘర్షణలో బహిరంగ విచారణ కోసం జైల్లో ఉన్న ప్రవీణ్, ఆరీఫ్‌లను కస్టడీలోకి తీసుకున్నామని ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. వారిని గురువారం శ్రీనగర్ కాలనీలోని నారాయణరావు ఇంటి పరిసరాలకు తీసుకెళ్లి విచారణ చేశామని అన్నారు. అనంతరం వారిని తిరిగి కోర్టుకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో కొందరు పోలీసుల ముందు వచ్చినప్పటికీ వివరాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
బడి బయట.. ‘బాల’ భారతం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బాలల భావి భారతం బడిబయట మగ్గుతోంది. బడిలో ఉండాల్సిన పిల్లలు హోటళ్లు, కార్ఖానాలు, చేలలో, కూలీలుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు పలుగు, పార పడుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా.. రూ.కోట్లు కుమ్మరించినా, విద్యాహక్కు చట్టం అమలులోకి తెచ్చినా డ్రాపౌట్స్ పెరుగుతున్నారు. బడిఈడు పిల్లలను బడిలోనే ఉంచాలనే విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జిల్లా ఆర్వీఎం అధికారులు జూన్‌లో నిర్వహించిన సర్వేలో 3,536 మంది బడి బయట ఉన్నట్లు గుర్తించారు. వారిని బడిలో చేర్పించేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించిన ఆర్వీఎం 1,327 మందిని బడిబాట పట్టించి నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అయినా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు చదువులకు దూరం కాగా, రూ.కోట్లు వెచ్చించినా ఫలితం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టం ఏం చెప్తుంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలనేది నిబంధన. ఇందుకోసం ఆర్వీఎం బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, కార్మిక శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నా అంతగా ప్రయోజనం లేదు. చాలా మంది పిల్లలు బడికి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి సిబ్బందిని పంపించి మరీ సర్వే జరిపించాలని ఇటీవలే మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆర్వీఎం అధికారులను సూచించింది. ఈ మేరకు 52 మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే జరిపారు. ప్రతి గ్రామంలోనూ సర్వే నిర్వహించి అత్యధికంగా కాగజ్‌నగర్ మండలంలో 506 మంది, అత్యల్పంగా కాసిపేట, భీమిని, దండేపల్లి మండలాల్లో ముగ్గురు చొప్పున పిల్లలు బడిబయట ఉన్నట్లు సర్వేలో తేలింది. రూ.లక్షలు వెచ్చించినా ఫలితం శూన్యం.. ఈ ఏడాదిలో బడిబాట, విద్యా సంబరాల కోసం పాఠశాలలకు కేటాయించిన స్కూల్ గ్రాంట్స్ నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆర్వీఎం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రాథమిక 3,084, ప్రాథమికోన్నత 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు స్కూల్‌గ్రాంట్స్ నుంచి రూ.500 ఖర్చు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలలు రూ.750 ఖర్చు చేయాలని పేర్కొన్నారు. విద్యా సంబరాల కోసం ఒక్కో ఎంఈవె నెల కోసం వాహనం పేరిట రూ.24 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టుకున్నారు. కాగా ప్రచారం కోసం రూ.60 వేల కరపత్రాలు, పోస్టర్లు ప్రింటింగ్ చేసినట్లు ఆర్వీఎం రికార్డులు చెప్తున్నాయి. రూ.40 వేల అడ్మిషన్ ఫారాలను ప్రింటింగ్ చేయించారు. 4 వేల బ్యానర్లు తయారు చేయించారు. కరపత్రాలు, పోస్టర్ల కోసం రూ.7.34 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. 4 వేల బ్యానర్ల కోసం రూ.13 లక్షలు ఖర్చు చేసినట్లు ఆర్వీఎం అధికారులు తెలిపారు. మొత్తంగా రూ.50 లక్షలకేపైనే బడిబయట పిల్లల కోసం ఖర్చు చేసినట్లు చెప్తున్నా... విద్యార్థుల శాతం గణనీయంగా పడిపోయి బడిబయటే పిల్లల భవిష్యత్ బుగ్గవుతుండటం చర్చనీయాంశం అవుతోంది.


