యాప్‌ద్బాంధవులు | Gaza young developers build survival apps as war reshapes daily life | Sakshi
Sakshi News home page

యాప్‌ద్బాంధవులు

May 21 2026 4:42 AM | Updated on May 21 2026 4:42 AM

Gaza young developers build survival apps as war reshapes daily life

కొత్తరూపు సంతరించుకుంటున్న గాజా టెక్‌ రంగం 

రోజువారీ అవసరాలకోసం ‘యాప్స్‌’డెవలప్‌ చేస్తున్న గాజా యువత

సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు.  

గాజా నగరంలోని ‘తాకత్‌’వర్క్‌ స్పేస్‌లో ఓ మూలన లాప్‌టాప్‌తో కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్‌ ఘాల్‌. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్‌ యాప్‌ను డెవలప్‌ చేస్తోంది. ఆమె డెవలప్‌ చేస్తున్న యాప్‌ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్‌ఈఎల్‌ఎన్‌ఐ). అంటే అరబిక్‌లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం.

 యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్‌. ఈ యాప్‌ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్‌–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్‌–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్‌ లైక్‌ క్యాబ్‌ షేరింగ్‌ అన్నమాట.  

తప్పిపోయిన వస్తువులు... 
సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ గ్రాడ్యుయేట్‌ బహా అల్‌మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్‌ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్‌ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. 

అలా డెవలప్‌ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్‌లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్‌ రూపొందించారు.  

అనేక అడ్డంకులు..  
అయితే, యాప్‌ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్‌్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్‌ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్‌పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్‌ఫామ్‌ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని.  

శిక్షణా కేంద్రంగా..  
అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్‌ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్‌ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్‌ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. 

ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్‌’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్‌ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు.  

ఉద్యోగులకు ‘తాకత్‌’... 
యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్‌ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్‌ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్‌ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్‌.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్‌స్పేస్‌ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్‌ అయిన షరీఫ్‌ నయీమ్‌. దాని పేరు ‘తాకత్‌’.

 ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్‌ లేక కొందరు ఆన్‌లైన్‌ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్‌’స్థాపించాను’అని నయీమ్‌ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్‌ అల్‌–బలాహ్‌ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement