Workers wages
-
కోటి ఆశలు నెరవేర్చాం!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక సంఘాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వారు పనిచేసే గ్రామీణ/పట్టణ ప్రాంతాల ఆధారంగా వారి వేతనాలను సవరించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమ ల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ అనే రెండు జోన్లు ఉండగా, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్–1), మున్సిపాలిటీలు (జోన్–2), గ్రామీణ ప్రాంతాలు (జోన్–3) అనే మూడు జోన్ల ఆధారంగా వేతనాలను ఖరారు చేసింది. స్థానికంగా ఉండే ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలను పెంచింది. జోన్–1లో అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌తో కలిసి గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక వర్గానికి సీఎం ఈ తీపి కబురు వినిపించారు. వారికి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ‘కార్పొరేషన్లలో ఇళ్ల అద్దెలు, ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువ కాబ ట్టి అక్కడ ఎక్కువ వేతనాలను, మున్సిపాలిటీల్లో కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం తక్కువగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనాల పెంపును మే డే రోజే ప్రకటిద్దామనుకున్నా కొందరి సూచనల కోసం ఆలస్యమైంది. కనీస వేతనాల పెంపు అమలు చేయని పరిశ్రమలపై కార్మీక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. కార్మీకశాఖ ను ఇంకా బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్న పరిశ్రమల్లో 80% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా నిబంధన పెట్టేందుకు అవకాశం ఉంది..’ అని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ భద్రత ‘ఏఐ వచ్చాక వైట్ కాలర్ జాబ్ ఉద్యోగాలొచ్చే పరిస్థితీ, ఉద్యోగ భద్రతా లేదు. చాలా దేశాల్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కోట్లాది మంది ఐటీ రంగ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ చదివితే రూ.లక్ష ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ సాంకేతిక నైపుణ్యంతో కూడిన చదువులతో రూ.2 లక్షల ఉద్యో గం వచ్చే అవకాశం ఉంది. బ్లూకాలర్ జాబ్స్‌కు ప్రపంచంలో విస్తృత డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయ లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే జర్మనీ, జపా న్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్‌లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీ దగ్గర నైపుణ్యం కలిగిన వారుంటే పంపాల ని ఈ దేశాలు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఎంత మందిని పంపిస్తారని అడుగుతున్నాయి. ఆ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్కిల్స్ వర్సిటీ, ఐటీసీల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల అప్‌గ్రేడేషన్‌తో ప్రభుత్వం పూర్తిగా బ్లూకాలర్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో చేరితే నెలకు రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌లో చేరేవారి కోసం కూడా మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను నేర్పడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. జర్మనీ, చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్‌లో 80 శాతం మందికి ఆంగ్లం రాదు. సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ నాలుగైదు దేశాలే తీరుస్తున్నాయి. ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. ఏఐ తుపాన్లో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. బ్లూ కాలర్ స్కిల్ నేర్చుకుంటే 100 శాతం జీవిత భద్రత ఉంటుంది..’అని రేవంత్ అన్నారు. గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ ‘ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వ మే శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. స్కిల్స్ వర్సిటీలో ఆరు నెలల శిక్షణ నుంచి నుంచి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వరకు వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. గతంలో గల్ప్ కార్మీకులు చనిపోతే శవాలను సైతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాలను తీసుకొస్తున్నాం. గల్ఫ్ ఏజెంట్లు పడగలెత్తి పెద్దపెద్ద పదవుల్లోకి వచ్చారు. కానీ కార్మికులు మోసపోతున్నారు. గల్ఫ్ కార్మీకులకు సంబంధించి త్వరలో మంచి పాలసీతో వస్తాం..’అని సీఎం చెప్పారు. ప్రధాని ప్రతిదీ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కార్మీకుల కోణం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సింగరేణిలో స్థానికులకే 80% ఉద్యోగాలు: మంత్రి వివేక్ సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు కార్మీక శాఖ మంత్రి జి.వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చెబుతున్నామని, హైస్కిల్డ్ ఉద్యోగాల విషయంలో వారిష్టమని అంటున్నామని చెప్పారు. కొత్తగా 56 ఏటీసీలను మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 118కి పెరగనుందన్నారు. -
కూలి ఇవ్వండయ్యా!
సాక్షి, అమరావతి: మండుటెండలో కష్టపడి పని చేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా కూలి కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి నెలాఖరుతో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.812 కోట్లు.. ఈ ఏప్రిల్ ఒకటి నుంచి శనివారం వరకు పనులు చేసిన కూలీలకు మరో రూ.195 కోట్లు.. మొత్తంగా రూ.1,007 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజుల లోపు కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్ర చట్టం చెబుతున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఈ పథకానికి సంబంధించి వంద శాతం కూలి డబ్బులు కేంద్రమే చెల్లిస్తుంది. అయితే, దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా బకాయిలు కేవలం మన రాష్ట్రంలోని కూలీలకు చెల్లించాల్సి ఉందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఈ సమస్య తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది మే, జూన్ , జూలై నెలల్లో దాదాపు రూ.రెండు వేల కోట్లు.. 2024 డిసెంబర్– 2025 మార్చి మధ్య దాదాపు రూ.1,000 కోట్లు బకాయిలు పెట్టి.. ఆలస్యంగా చెల్లించారని కార్మీక సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో అధికార పార్టీ నేతలు దొంగ మçస్తర్లతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో కేంద్రం పరిశీలన చేస్తుండడం వల్లే కూలీలకు వేతన బకాయిల చెల్లింపులో ఆలస్యమవుతోందని అధికార వర్గాల సమాచారం. సకాలంలో కూలి అందక పోవడంతో పనులకొచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు 75.43 లక్షల మంది ఏటా ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి, రూ.6,500–7,000 కోట్ల మేర లబ్ధి పొందారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఒకే రోజు 54 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవ్వడం రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఏటా ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 25 లక్షల మందికి పనులు కల్పించగా, ఈ ఏడాది ప్రస్తుత ఏప్రిల్‌లో ఇప్పటి వరకు (20 రోజుల్లో) కేవలం 78.94 లక్షల మందికి మాత్రమే అంటే రోజుకు సగటున ఐదు లక్షల మందికి కూడా పనులు కల్పించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ఉపాధి హామీ పథకం పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. కుటుంబాన్ని పోషించుకుందామని పనికి వెళితే కనీసం కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని కూలి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. – కేజే ఫ్లోరెన్స్, కుముదువల్లి, పాలకోడేరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధిలో కోత.. పేదలకు వాతపని దినాల కల్పనలో పదేళ్లు వెనక్కు వెళ్లిన వైనంవంద శాతం కూలీ డబ్బులు కేంద్రమే ఇస్తున్నా చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యంచేసిన పనికి వంద శాతం మేర కూలి డబ్బులు కేంద్రమే ఇచ్చే ఉపాధి హామీ పథకం అమలులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అథమ స్థాయికి దిగజారి పోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆఖరి ఏడాది 2023–24లో 25.55 కోట్ల పని దినాలు కల్పించగా, మార్చి 31తో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు 18.59 కోట్ల పని దినాలే పొందగలిగారు. ఈ లెక్కన ఏకంగా దాదాపు 7 కోట్ల పనిదినాలు తగ్గిపోయాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పేదలు రూ.6,277 కోట్ల ప్రయోజనం పొందగా, 2025–26లో రూ.4,952 కోట్లు మాత్రమే లబ్ధి పొందారు. తద్వారా పేదలు రూ.1,325 కోట్ల మేర ఆర్థిక లబ్ధిని కోల్పోయారు. 2023–24లో 75.43 లక్షల మందికి పనులు దొరకగా, 2025–26లో 67.62 లక్షల మంది మాత్రమే పనులు పొందారు. ఈ లెక్కన బాబు హయాంలో దాదాపు 8 లక్షల మంది పనులు కోల్పోయారు. వంద రోజుల పని విషయానికి వస్తే 2023–24లో 6.87 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా, 2025–26లో ఆ సంఖ్య కేవలం 2.15 లక్షలే. అంటే దాదాపు మూడొంతుల కుటుంబాలు తగ్గిపోయాయి. జగన్ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబం సరాసరిన ఏటా 55 పని దినాలు పొందగా, అది ప్రస్తుతం 43 రోజులకు పడిపోయింది. గత జగన్ ప్రభుత్వంలో కల్పించిన మొత్తం పనుల్లో 22–23 శాతం ఎస్సీలు లబ్ధి పొందగా, 2025–26లో అది 20.47 శాతానికి మాత్రమే పరిమితమైంది. దివ్యాంగులు సైతం జగన్ ప్రభుత్వంలో 80 వేల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో 66 వేలకు తగ్గిపోయారు. ‘ఉపాధి’లోనూ రాజకీయమే 2024 జూన్‌లో చంద్రబాబు సీఎం అయ్యాక తొలి రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలులో పనిచేసే గ్రామ స్థాయి ఫీల్డు అసిస్టెంట్లను రాజకీయ కారణాలతో పెద్ద ఎత్తున తొలగించింది. ఈ విషయమై బాధిత ఫీల్డు అసిస్టెంట్లు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఫీల్డు అసిస్టెంట్లు తమకు అనుకూలమైన వారికే పనులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో పనుల కల్పన తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. దశాబ్ద కనిష్టానికి పనుల కల్పనరాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అంతకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఆర్థిక ఏడాది 2014–15లో అతి తక్కువ పని దినాల తర్వాత 2015–16లో 19.91 కోట్ల పనిదినాల పాటు పనులు దక్కాయి. ఆ తర్వాత గత పదేళ్లలో ఒక ఆర్థిక ఏడాదిలో ఎప్పుడూ 20 కోట్లకు తక్కువగా పని దినాలు కల్పించిన దాఖలాలు లేవు. ఉపాధి హామీ పథకం కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో భాగం కావడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిత్యం గొప్పలు చెబుతున్న తరుణంలో దిగజారిన ఈ రికార్డు వారి పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండగా, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనూ పేదలకు పనుల కల్పన తక్కువే. అప్పట్లో 101 కోట్ల మందికి పనులు కల్పించగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏకంగా 120 కోట్ల మందికి పనులు కల్పించారు. 23.2% తక్కువగా పనులు: లిబ్టెక్2024–25తో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల పేదలు రూ.1,232 కోట్లు నష్టపోయారని లిబ్టెక్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఇందులో 40 శాతం అంటే దాదాపు రూ.484 కోట్ల మేర ఎస్సీ, ఎస్టీల కుటుంబాలే నష్టపోయాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం తీరు తెన్నులపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఏటా నివేదికలు అందజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఈ పథకం అమలుపై శనివారం నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో అత్యంత తక్కువగా పని దినాల కల్పనలో ఇదే రికార్డు అని స్పష్టం చేసింది. 2024–25 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2025–26లో పేదలకు 23.2 శాతం మేర పనుల కల్పన తగ్గిందని చెప్పింది. 2024–25లో 24.22 కోట్ల పని దినాలు లభ్యంకాగా, 2025–26లో కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే పనుల కల్పన సాగినట్టు లిబ్టెక్ పేర్కొంది. వంద రోజులు పనులు కల్పించిన కుటుంబాల సంఖ్య కూడా 5.10 లక్షల నుంచి 2.16 లక్షలకు తగ్గిపోయిందని తెలిపింది. గత ఏడాది రాష్ట్రంలో 7.20 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులను తొలగించడం, మరో వైపు జాబ్‌కార్డులు ఉన్న వారికి పనులు కల్పన తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని తన నివేదికలో స్పష్టం చేసింది. -
కొలువుల కుదింపు... వేతనాల్లోనూ కోత!
సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియలో ప్రతిచోటా కోతల పర్వం కొనసాగుతోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వేతన సవరణ తుది ఉత్తర్వుల్లో ఖరారు చేసిన ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి కత్తెర పడుతోంది. సర్వీసు నిబంధనల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్మికుల కనీస వేతన సవరణ చివరిసారిగా 2006లో జరిగింది. అప్పుడు చేసిన సవరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా వేతన సవరణ ఊసే లేదు. దీనిపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి, రెండో కనీస వేతన సలహా బోర్డులు లోతుగా కసరత్తు చేసి గత ప్రభుత్వానికి వివిధ ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిపై గత ప్రభుత్వం కసరత్తు చేపట్టి ఐదు ఎంప్లాయిమెంట్లకు తుది ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గెజిట్లు విడుదల కాకపోవడంతో అమలుకు నోచుకోలేదు. మరో 12 ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించినా ఉత్తర్వులు వెలువడలేదు. మిగిలిన ఎంప్లాయిమెంట్లు ప్రతిపాదన దశలోనే ఉండిపోయాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం 73 రకాల ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను గతేడాది జనవరి 29న జారీ చేయగా.. ఇప్పుడున్న కనీస వేతన సలహా బోర్డు తుది ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నాలుగు అంశాలు కొలిక్కి... ఈ బోర్డు గతేడాది డిసెంబర్లో ఏర్పాటు కాగా.. అప్పట్నుంచి ఏడుసార్లు సమావేశమైంది. ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్లపై సుదీర్ఘంగా చర్చించి ఐదు ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలను దాదాపు సిద్ధం చేసింది. ఇందులో నాలుగు రకాల అంశాలపై కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కార్మీకుల వేతనాలకు సంబంధించి బేసిక్ వేజ్, వీడీఏ ఖరారుతో పాటు, ఉద్యోగ హోదా (డిజిగ్నేషన్), సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫుట్ నోట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. కట్.. కట్... కట్... కనీస వేతన సలహా మండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాలపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు నిర్ణయాలు అధికారికంగా బహిర్గతం కానప్పటికీ.. చర్చించిన అంశాలు, మినిట్స్ తదితర సమాచారం బయటకు రావడంతో సంఘాలు భగ్గుమంటున్నాయి. కార్మిక సంఘాల ద్వారి తెలిసిన సమాచారం ప్రకారం.. కనీస వేతన సలహా బోర్డు సెక్యూరిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిమెంట్స్కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఫుట్ నోట్స్ కీలకం.. కార్మీకుల సర్వీసు నిబంధనల్లో ఫుట్ నోట్స్ కీలకం. ఈ ఫుట్నోట్స్ ఆధారంగా కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ వేతనాలను సవరిస్తారు. ఉదాహరణకు ఒక కేటగిరీలో కార్మీకుడు ఐదేళ్లపాటు పనిచేస్తే ఆరో సంవత్సరం కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ అధిక వేతనం ఇవ్వాలి. నైట్ షిఫ్ట్ అలవెన్సు 25 శాతం, రిస్క్ అలవెన్స్ 20 శాతం, అధిక ఎత్తులు, భూమి లోపల పనిచేసే వారికి అదనపు వేతనం జారీ తదితర నిబంధనలున్న ఫుట్ నోట్లను తగ్గించినట్లు సమాచారం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్ 21 ఫుట్నోట్లను 5కు పరిమితం చేశారు. ఏకంగా 16 ఫుట్నోట్లు రద్దు చేశారు. ఇలా అన్ని సెక్టార్లలోనూ ఫుట్నోట్లకు కోత పడింది. హైలీ స్కిల్డ్ వేతనంలో రూ.7,234 కోత 2021 జూన్‌లో ప్రభుత్వం ఐదు కేటగిరీలకు కనీస వేతనాలకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బోర్డు ప్రతిపాదించిన వేతనాలను పరిశీలిస్తే గతంలో కంటే భారీగా కోత పెట్టినట్లు తెలుస్తోంది. హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.7,234 కోత పడగా.. అన్‌స్కిల్డ్‌లో రూ.3,018 కోత పడింది. వాస్తవానికి రోజుకురోజు నిత్యావసర సరుకుల ధరలు, రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఐదేళ్ల క్రితం నిర్దేశించిన వేతనాలకంటే 10 శాతం నుంచి 20 శాతం మేర కోత పెడుతూ బోర్డు ప్రతిపాదనలు తయారు చేయడంపై కార్మీక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.భారీగా ఉద్యోగాల కోతలు గతంలో హైలీస్కిల్డ్–1, 2, 3, 4, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కేటగిరీలుండగా... ఇప్పుడు వాటిని హైలీస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కేటగిరీలకే పరిమితం చేశారు. 3 ఉద్యోగ కేటగిరీలు తొలగించడంతో ఉపాధి సంస్థల్లో భారీగా ఉద్యోగులు తగ్గిన ట్లేనని కార్మీక సంఘాలు అంటున్నాయి. సెక్యూరిటీ సర్వీసెస్ ఎంప్లాయిమెంట్‌లో 26 జూన్ 2021లో జారీ చేసిన జీఓఎంఎస్ 21 ప్రకారం 66 ఉద్యోగాలున్నాయి. గతేడాది విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్లో వీటి సంఖ్య 11కు తగ్గించారు. వీటిని బోర్డు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడే 55 ఉద్యోగాలకు కోత పడింది. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్‌లో 611 ఉద్యోగాలను 58కి కుదించడంతో 533 ఉద్యోగాలకు కోతపడింది. స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఎంప్లాయి మెంట్లో 196 ఉద్యోగాలను 69కి కుదించారు. ఇలా ప్రతి ఎంప్లాయిమెంట్‌లో ఉద్యోగాల సంఖ్య తగ్గిస్తూ కనీస వేతన సలహా బోర్డు ప్రతిపాదనలు తుదిరూపుకు తెచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల సంఖ్య కుదించడంతో ఉన్న కార్మికులపై పనిఒత్తిడి పడనుంది. -
'వేతన యాతన'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రలో అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ జరగలేదు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మీక చట్టాల్లో ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా ఆ దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుంచి 2012 మధ్య ఇచ్చిన వేతన సవరణ ఉత్తర్వులే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ ఉపాధి రంగాల్లో కనీస వేతనం రూ. 3,370 నుంచి రూ. 5,138 మధ్య ఉంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వాటిలో దాదాపు 1.27 కోట్ల మంది కార్మీకులు పనిచేస్తున్నారు. వారిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు రాష్ట్ర కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణ చేస్తుంది. అదే తరహాలో అసంఘటితరంగ కార్మికుల వేతన సవరణను కూడా ఐదేళ్లకోసారి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోని కార్మీక వేతన సలహా బోర్డు పాత్ర కీలకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేతన సవరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. కొత్త రాష్ట్రంలో నాలుగు బోర్డులు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగు కనీస వేతన సవరణ సలహా బోర్డులు ఏర్పాటయ్యాయి. మొదటి సలహా బోర్డు 2014 నవంబర్‌లో ఏర్పాటై 2016 నవంబర్‌తో ముగిసింది. రెండో బోర్డు 2016 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ తదుపరి బోర్డు ఏర్పాటులో జాప్యంతో 2021 ఫిబ్రవరి కొనసాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమైంది. ఆ తర్వాత మూడో బోర్డును ప్రభుత్వం 2023 మేలో ఏర్పాటు చేసింది. అయితే 2023 డిసెంబర్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేయడంతో ఆ బోర్డు రద్దయ్యింది. 2024 మార్చిలో నాలుగో బోర్డు చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బోర్డును 2024 డిసెంబర్లో నియమించింది. ఏయే బోర్డులు ఏం చేశాయి? అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి బోర్డు పలు దఫాల చర్చల అనంతరం అన్‌స్కిల్డ్ కార్మీకుడి కనీస వేతనాన్ని రూ. 11,905.36 నుంచి రూ. 12,068.80 మధ్య ఉండేలా సిఫారసు చేసింది. మొత్తం 73 షెడ్యూల్డ్ రంగాలకుగాను 34 రంగాలకు ఈ వేతనాలను ఖరారుచేస్తూ కార్మీక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇక రెండో బోర్డు.. మొదటి బోర్డు చేసిన సిఫార్సులను పునఃసమీక్షించి కేటగిరీలవారీగా వేతన సవరణ పూర్తిచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందులో 5 కేటగిరీలకు ప్రభుత్వం జీఓలు ఇచ్చినప్పటికీ వాటిని గెజిట్‌లో చేర్చలేదు. దీంతో మరో 12 కేటగిరీల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. ఇక మిగిలిన 56 కేటగిరీల ప్రతిపాదనల ఊసేలేదు. ఆ తర్వాత ఏర్పాటైన మూడో బోర్డు ప్రస్తుతమున్న ఏడు కార్మిక కేటగిరీలను నాలుగుకు కుదించేందుకు ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మూడో బోర్డు రద్దైంది. ప్రస్తుత నాలుగో బోర్డు పలు దఫాలు సమావేశమైనా ఇంకా నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఈలోగా రేవంత్ ప్రభుత్వం గతేడాది మొత్తం 73 ఉపాధి రంగాలకూ కనీస వేతన సవరణ చేయాలని నిర్ణయిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కనీస వేతన సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేతన సవరణ లెక్క సూత్రం... ఒక కార్మీకుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే అందులో కార్మీకుడిని ఒక యూనిట్ విలువగా, కార్మికుని భార్యను 0.8 యూనిట్‌గా, ఇద్దరు పిల్లల్ని 0.6 చొప్పున నిర్ధారిస్తారు. లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆమోదం ప్రకారం ఒక కార్మీకుడు జీవించేందుకు అవసరమైన కేలరీలు 2,700. ఒక కుటుంబానికి ఏడాదికి కావాల్సిన వస్త్రం 72 గజాలు. ఇంటి అద్దె కింద 10 శాతం, పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు 20 శాతం చొప్పున లెక్కించి వేతన సవరణ చేయాలి. సవరణ సమయంలో నిత్యావసరాల ధరలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. శాస్త్రీయత పాటించకుంటే న్యాయ చిక్కులు కార్మికుల కనీస వేతన సవరణ ప్రక్రియను చట్టప్రకారం చేయాలి. అక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా గణించాలి. గత ప్రభుత్వ నిర్ణయాల కంటే మెరుగ్గా వేతన సవరణ చేస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతున్నా అందుకు శాస్త్రీయత, క్రమపద్ధతి పాటించకుంటే న్యాయ చిక్కులు తప్పవు. – ఎండీ యూసూఫ్, కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్భరంగా కార్మీకుల జీవితాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా వేతన సవరణ జరగకపోవడంతో కార్మీకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా కనీస వేతన సవరణపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం సరికాదు. కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా వేతనాలున్నాయి. – సుంకరి మల్లేశం, ఈపీఎఫ్ఓ సీబీటీ మెంబర్, భారత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఇది శ్రమ దోపిడీయే ప్రభుత్వం దశాబ్దన్నర కాలంగా వేతన సవరణ చేయకపోవడం కార్మీకుల శ్రమను దోచుకోవడమే. మొత్తం 73 ఉపాధి రంగాలకు వేతనాలను సవరించాలని రెండో కార్మీక వేతన సవరణ సలహా బోర్డు 2021 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అందులో 5 ఉపాధి రంగాలకు తుది ఉత్తర్వులు వెలువడ్డా గెజిట్‌లో ప్రచురించకపోవడం, మిగిలిన ఉపాధి రంగాలకు జీఓలు ఇవ్వకపోవడంతో కార్మీకులు నష్టపోతున్నారు. – దేవసాని భిక్షపతి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణకు పడని ముందడుగుఅన్‌స్కిల్డ్ కార్మీకుడైన నర్సింహ 20 ఏళ్లుగా ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ రంగానికి సంబంధించి జరిగిన వేతన సవరణ ప్రకారం ఆయన నెలవారీ కనీస వేతనంరూ. 3,370గా ఖరారైంది. ఆ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నర్సింహ అందుకుంటున్న వేతనం రూ. 12,420 మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో కనీస వేతన సవరణ సలహా బోర్డు సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 22 ప్రకారం నర్సింహ నెలవారీ కనీస వేతనం రూ. 23,275గా ఉండాలి. కానీ ఆ జీఓను గెజిట్‌లో ప్రచురించకపోవడం వల్ల ఆయన ఏకంగా రూ. 10,855 తక్కువ వేతనం పొందుతున్నాడు. -
పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలు వద్దు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోంశాఖ ఆదేశాలను ఉల్లంఘించిన కంపెనీలూ, యాజమా న్యాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ మే 15న ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 12కి సుప్రీంకోర్టు పొడిగించింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన సమయంలో ఎటువంటి పనీ జరగకపోయినప్పటికీ, కార్మికుల వేతనాల్లో ఎటువంటి కోతలూ విధించరాదనీ, పూర్తి జీతాలు చెల్లించాలంటూ హోంమంత్రిత్వ శాఖ కంపెనీలకూ, యాజమాన్యాలకూ సర్క్యులర్ జారీచేసింది. ఎవ్వరినీ ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దనీ, వేతనాల్లో కోత విధించవద్దంటూ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్‌కి లేఖలు కూడా రాసింది. వంద శాతం వేతనం ఇవ్వకపోవడాన్ని నేరపూరితమనీ, వారిపై చర్యలు తీసుకొంటామన్న హోంమంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లోని అంశాల పట్ల జస్టిస్ అశోఖ్ భూషణ్, ఎస్.కె.కౌల్, ఎంఆర్.షాల తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ సర్క్యులర్ని సవాల్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సహా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. చిన్న పరిశ్రమలకు రాష్ట్రాలు చేయూతనివ్వాల్సి ఉంటుందనీ, దీనిపై యాజమాన్యాల్లోనూ, కార్మికుల్లోనూ చర్చలు జరగాలని కోర్టు అభిప్రాయపడింది. -
కడుపు మాడ్చుతున్న ఉపాధి
జిల్లాలో కరువు తీవ్ర రూపం దాల్చి విలయతాండవం చేస్తోంది. కనీసం మేరకు పంటలు కూడా లేక వ్యవసాయ భూములు బీళ్లుగామారి ఎడారిని తలపిస్తోంది. కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఉపాధి పనులైనా ఆదుకుంటాయన్న ఆశ కూడా కూలీలకు కానరావడం లేదు. నెలల తరబడి ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు అందక ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, చిత్తూరు:బతుకు జీవనం కోసం ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాల మొత్తాన్ని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో మొత్తం 47,206 శ్రమ శక్తి సంఘాల ద్వారా 6,41,061 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ఇప్పటి వరకు రూ.622.07 కోట్ల మేరకు వెచ్చించి ఉపాధి పనులు చేశారు. మొత్తం 1.69 లక్షల పనులు చేపట్టగా 85 వేల పనులు పూర్తయ్యాయి. మరో 84 వేల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 2,76,402 కుటుంబాలకు చెందిన 4,47,354 మంది కూలీలకు 1,62,53,426 పనిదినాలు కల్పించడం జరిగింది. అందులో పురుషులు 2,01,978 మంది, మహిళలు 2,45,376 మంది ఉన్నారు. అందని వేతనాలు గత ఏడాది డిసెంబర్ 2వ తేది నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు 25.14 లక్షల పని దినాలకు గాను రూ. 50,29,57,865 మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్ కాంపెనెంట్ కింద రూ. 103.85 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అందులో పంచాయతీరాజ్ పనులకు రూ. 65.69 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపెనెంట్ మొత్తం రూ. 154 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టించుకోని ప్రభుత్వం జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు శనివారం వేతనాలను అందించాల్సి ఉంది. ఈ వేతనాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల బ్యాంకు, పోస్టాఫీసుల్లోని ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే గత డిసెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు వేతనాలు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. దీని ప్రభావంతో కూలీల సంఖ్య 90 వేల నుంచి 65 వేలకు పడిపోయింది. వేతనాలు అందక.. పనులులేక ఉపాధి హామీ పనుల వేతనాలు నెలల తరబడి రాకపోవడంతో కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇతర పనులకు వెళ్లాలన్నా కరువు పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు కూడా అంతంత మాత్రంగా ఉంది. దీంతో కూలీలకు ఇతర పనులు దొరక్క, ఉపాధి పనులకు వెళ్లలేక అవస్థలు పడాల్సి వస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇప్పటికే వేలాది మంది కూలీలు తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వలసలు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని బతులతో జీవనం సాగిస్తున్నారు. ముఖ్యమంతి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోనే నిత్యం సుమారు 10 వేల మంది కూలీలు ఉదయం బెంగళూరుకు వెళ్లి కూలీ పనులు చేసి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. -
బయోమెట్రిక్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని కార్మికుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. కార్మికుల సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ కార్మికులు, రవాణా విభాగం డ్రైవర్ల వేతనాల పెంపుపై జీహెచ్ఎంసీకి అనుమతిచ్చింది. పెంచిన వేతనాలు జూలై 16 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. వేతనాల పెంపు నేపథ్యంలో కార్మికుల సాధారణ హాజరుతో పాటు వారికి బయోమెట్రిక్ విధానం అమలు, సమ్మెలో పాల్గొనరాదనే ఆదేశాలను సైతం ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తికి విఘాతం కలిగేలా కార్మికులు ఎలాంటి సమ్మెలకు దిగినా సహించేది లేదని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మెల్లో పాల్గొనరాదని, వారికి బయోమెట్రిక్ విధానం అమలు చేసే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం ‘సాక్షి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నాయని, నగరంలో జీవన వ్యయం ఎక్కువైనందున వారి వేతనాలు పెంచాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ గత నెల 16న ప్రభుత్వానికి లేఖ రాశారు. కమిషనర్ ప్రతిపాదనలను అంగీకరించిన ప్రభుత్వం.. కార్మికులకు పెరిగిన వేతనాలను జీహెచ్ఎంసీ బడ్జెట్ నుంచే అందించాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. దీనితో పాటు కార్మికులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అక్రమాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విధులకు హాజరయ్యే పారిశుధ్య కార్మికుల ఫొటోలతోపాటు వారు పనిచేసే ప్రాంతాల్లోని డస్ట్బిన్ల ఫొటోలను అప్లోడ్ చేయడంతోపాటు కార్మికుల బయోమెట్రిక్ హాజరు నమోదు బాధ్యతను శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగించింది. ఎంటమాలజీ వర్కర్ల ఫొటోలను అప్లోడ్ చేస్తూ.. ప్రతిరోజూ వారు విధులకు హాజరయ్యే ప్రాంతాల వివరాలను కూడా అందజేయాల్సిందిగా ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పజెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి వాహనానికీ జీపీఎస్ పరికరాన్ని అమర్చి అవి సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్లపై ఉంచింది. -
సౌదీలో సగం వేతనాలే..
* అంతర్యుద్ధంతో కోత విధించిన కంపెనీలు * ఇబ్బందుల్లో తెలంగాణ కార్మికులు మోర్తాడ్: సౌదీ అరేబియాలో అంతర్యుద్ధం కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిన కార్మికుల వేతనాలను యాజమాన్యాలు సగానికి తగ్గించాయి. స్వదేశాలకు వెళ్తామని కార్మికులు చెబుతున్నా పాస్‌పోర్టులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనాలు చెల్లించేందుకు తొలుత ఒప్పందాలు కుదుర్చుకున్న యాజమాన్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం వేతనాలనే చెల్లిస్తున్నట్లు అక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ భోజనం, వసతి ఉన్న కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, మిగిలిన కార్మికుల పరిస్థితి మరింత భిన్నంగా తయారైంది. ఒక్కో వీసాకు రూ.75 వేల నుంచి రూ. లక్ష వరకు ఏజెంట్లకు చెల్లించి గల్ఫ్‌కు వచ్చిన కార్మికులకు ఇప్పుడు తక్కువ వేతనాలు అందుతుండటంతో దిక్కుతోచకున్నారు. విదేశాలకు వెళ్లడానికి బంగారం అప్పుగా తీసుకుని తులానికి అర్ధ తులం వడ్డీగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, తక్కువ వేతనంతో పని చేస్తే తమ ఖర్చులు పోనూ వడ్డీలకే సరిపోవని వారి ఆవేదన. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మికులకు పూర్తి వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
షూటింగ్‌లు బంద్..చాంబర్లో చర్చలు..
సోమవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. చలనచిత్ర సీమకు చెందిన కార్మికుల వేతనాలు, ఇతర అంశాలపై ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులకూ, నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అవాంతరం ఏర్పడడంతో సోమవారం సాయంత్రం నుంచి ఇరు వర్గాల మధ్య హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిలింఛాంబర్లో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. దీనిపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. కొందరు నిర్మాతల్లో మిశ్రమ స్పందన కనిపించినా... సినీ కార్మికులకు అనుకూలంగానే ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. సోమవారం చర్చ ఆసాంతం కార్మికుల పనివేళలు, బేటాల పైనే జరిగింది. ఆ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి రాలేదు. ఇంకా వేతనాలు, తదితర అంశాల గురించి చర్చించాల్సి ఉంది’’ అని వివరించారు. ఈ వార్త ప్రచురించే సమయానికి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ‘‘మంగళవారం కూడా షూటింగ్‌ల బంద్‌ను కొనసాగించాలా, వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అది రాత్రి పొద్దుపోయాక వచ్చే చర్చల ఫలితాన్ని బట్టి ఉంటుంది’’ అని వెంకటేశ్ చెప్పారు.


