కూలి ఇవ్వండయ్యా! | Chandrababu Govt Dues above 1000 Crores to Rural Employment Guarantee workers | Sakshi
Sakshi News home page

కూలి ఇవ్వండయ్యా!

Apr 20 2026 4:53 AM | Updated on Apr 20 2026 4:53 AM

Chandrababu Govt Dues above 1000 Crores to Rural Employment Guarantee workers

అధికార పార్టీ నేతల దొంగ మస్తర్లతో ‘ఉపాధి’ చెల్లింపుల్లో ఆలస్యం

రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఏకంగా రూ.1,027 కోట్ల బకాయిలు

ఫిర్యాదుల వెల్లువతో కేంద్రం పరిశీలనకు ఎక్కువ సమయం

దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే బకాయిలు అత్యధికం

డిసెంబర్‌ నుంచి పనులు చేసిన వారెవరికీ డబ్బులు అందని వైనం

గత ప్రభుత్వ చివరి ఏడాది 2023–24లో 25.55 కోట్ల పని దినాలు

2025–26లో 18.59 కోట్ల పని దినాలు  

దాదాపు తగ్గిపోయిన 7 కోట్ల పనిదినాలు

2023–24లో పేదలకు రూ.6,277 కోట్ల ప్రయోజనం

2025–26లో రూ.4,952 కోట్లు మాత్రమే లబ్ధి  

రూ.1,325 కోట్లు నష్టపోయిన పేదలు 

2023–24లో 75.43 లక్షల మందికి పనులు.. 2025–26లో 67.62 లక్షల మందికే.. ఏకంగా 8 లక్షల మందికి పనులను దూరం చేసిన బాబు సర్కార్‌ 

జగన్‌ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి సగటున ఏటా 55 పని దినాలు.. అది ప్రస్తుతం 43 రోజులే 

బాబు ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగి పేదల జీవనోపాధికి భారీగా గండి 

సాక్షి, అమరావతి: మండుటెండలో కష్టపడి పని చేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా కూలి కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి నెలాఖరుతో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.812 కోట్లు.. ఈ ఏప్రిల్‌ ఒకటి నుంచి శనివారం వరకు పనులు చేసిన కూలీలకు మరో రూ.195 కోట్లు.. మొత్తంగా రూ.1,007 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజుల లోపు కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్ర చట్టం చెబుతున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఈ పథకానికి సంబంధించి వంద శాతం కూలి డబ్బులు కేంద్రమే చెల్లిస్తుంది. అయితే, దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా బకాయిలు కేవలం మన రాష్ట్రంలోని కూలీలకు చెల్లించాల్సి ఉందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఈ సమస్య తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది మే, జూన్‌ , జూలై నెలల్లో దాదాపు రూ.రెండు వేల కోట్లు.. 2024 డిసెంబర్‌– 2025 మార్చి మధ్య దాదాపు రూ.1,000 కోట్లు బకాయిలు పెట్టి.. ఆలస్యంగా చెల్లించారని కార్మీక సంఘాల నేతలు తెలిపారు. 

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో అధికార పార్టీ నేతలు దొంగ మçస్తర్లతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో కేంద్రం పరిశీలన చేస్తుండడం వల్లే కూలీలకు వేతన బకాయిల చెల్లింపులో ఆలస్యమవుతోందని అధికార వర్గాల సమాచారం. సకాలంలో కూలి అందక పోవడంతో పనులకొచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో దాదాపు 75.43 లక్షల మంది ఏటా ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి, రూ.6,500–7,000 కోట్ల మేర లబ్ధి పొందారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఒకే రోజు 54 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవ్వడం రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఏటా ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 25 లక్షల మందికి పనులు కల్పించగా, ఈ ఏడాది ప్రస్తుత ఏప్రిల్‌లో ఇప్పటి వరకు (20 రోజుల్లో) కేవలం 78.94 లక్షల మందికి మాత్రమే అంటే రోజుకు సగటున ఐదు లక్షల మందికి కూడా పనులు కల్పించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది.  

ఇలాగైతే ఎలా బతకాలి? 
ఉపాధి హామీ పథకం పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. కుటుంబాన్ని పోషించుకుందామని పనికి వెళితే కనీసం కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని కూలి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. 
– కేజే ఫ్లోరెన్స్, కుముదువల్లి, పాలకోడేరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా  

ఉపాధిలో కోత.. పేదలకు వాత
పని దినాల కల్పనలో పదేళ్లు వెనక్కు వెళ్లిన వైనం
వంద శాతం కూలీ డబ్బులు కేంద్రమే ఇస్తున్నా చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం

చేసిన పనికి వంద శాతం మేర కూలి డబ్బులు కేంద్రమే ఇచ్చే ఉపాధి హామీ పథకం అమలులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అథమ స్థాయికి  దిగజారి పోయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆఖరి ఏడాది 2023–24లో 25.55 కోట్ల పని దినాలు కల్పించగా, మార్చి 31తో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు 18.59 కోట్ల పని దినాలే పొందగలిగారు. ఈ లెక్కన ఏకంగా దాదాపు 7 కోట్ల పనిదినాలు తగ్గిపోయాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పేదలు రూ.6,277 కోట్ల ప్రయోజనం పొందగా, 2025–26లో రూ.4,952 కోట్లు మాత్రమే లబ్ధి పొందారు. తద్వారా పేదలు రూ.1,325 కోట్ల మేర ఆర్థిక లబ్ధిని కోల్పోయారు. 


2023–24లో 75.43 లక్షల మందికి పనులు దొరకగా, 2025–26లో 67.62 లక్షల మంది మాత్రమే పనులు పొందారు. ఈ లెక్కన బాబు హయాంలో దాదాపు 8 లక్షల మంది పనులు కోల్పోయారు. వంద రోజుల పని విషయానికి వస్తే 2023–24లో 6.87 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా, 2025–26లో ఆ సంఖ్య కేవలం 2.15 లక్షలే. అంటే దాదాపు మూడొంతుల కుటుంబాలు తగ్గిపోయాయి. జగన్‌ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబం సరాసరిన ఏటా 55 పని దినాలు పొందగా, అది ప్రస్తుతం 43 రోజులకు పడిపోయింది. గత జగన్‌ ప్రభుత్వంలో కల్పించిన మొత్తం పనుల్లో 22–23 శాతం ఎస్సీలు లబ్ధి పొందగా, 2025–26లో అది 20.47 శాతానికి మాత్రమే పరిమితమైంది. దివ్యాంగులు సైతం జగన్‌ ప్రభుత్వంలో 80 వేల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో 66 వేలకు తగ్గిపోయారు. 

‘ఉపాధి’లోనూ రాజకీయమే 
2024 జూన్‌లో చంద్రబాబు సీఎం అయ్యాక తొలి రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలులో పనిచేసే గ్రామ స్థాయి ఫీల్డు అసిస్టెంట్లను రాజకీయ కారణాలతో పెద్ద ఎత్తున తొలగించింది. ఈ విషయమై బాధిత ఫీల్డు అసిస్టెంట్లు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఫీల్డు అసిస్టెంట్లు తమకు అనుకూలమైన వారికే పనులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో పనుల కల్పన తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. 


దశాబ్ద కనిష్టానికి పనుల కల్పన
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అంతకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఆర్థిక ఏడాది 2014–15లో అతి తక్కువ పని దినాల తర్వాత 2015–16లో 19.91 కోట్ల పనిదినాల పాటు పనులు దక్కాయి. ఆ తర్వాత గత పదేళ్లలో ఒక ఆర్థిక ఏడాదిలో ఎప్పుడూ 20 కోట్లకు తక్కువగా పని దినాలు కల్పించిన దాఖలాలు లేవు. ఉపాధి హామీ పథకం కార్య­క్రమం ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో భాగం కావడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు,  పవన్‌ కళ్యాణ్‌లు నిత్యం గొప్పలు చెబుతున్న తరుణంలో దిగజారిన ఈ రికార్డు వారి పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండగా, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనూ పేదలకు పనుల కల్పన తక్కువే. అప్పట్లో 101 కోట్ల మందికి పనులు కల్పించగా, 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఏకంగా 120 కోట్ల మందికి పనులు కల్పించారు.  

23.2% తక్కువగా పనులు: లిబ్‌టెక్‌
2024–25తో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల పేదలు రూ.1,232 కోట్లు నష్టపోయారని లిబ్‌టెక్‌ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఇందులో 40 శాతం అంటే దాదాపు రూ.484 కోట్ల మేర ఎస్సీ, ఎస్టీల కుటుంబాలే నష్టపోయాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం తీరు తెన్నులపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఏటా నివేదికలు అందజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఈ పథకం అమలుపై శనివారం నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో అత్యంత తక్కువగా పని దినాల కల్పనలో ఇదే రికార్డు అని స్పష్టం చేసింది. 

2024–25 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2025–26లో పేదలకు 23.2 శాతం మేర పనుల కల్పన తగ్గిందని చెప్పింది. 2024–25లో 24.22 కోట్ల పని దినాలు లభ్యంకాగా, 2025–26లో కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే పనుల కల్పన సాగినట్టు లిబ్‌టెక్‌ పేర్కొంది. వంద రోజులు పనులు కల్పించిన కుటుంబాల సంఖ్య కూడా 5.10 లక్షల నుంచి 2.16 లక్షలకు తగ్గిపోయిందని తెలిపింది. గత ఏడాది రాష్ట్రంలో 7.20 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులను తొలగించడం, మరో వైపు జాబ్‌కార్డులు ఉన్న వారికి పనులు కల్పన తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని తన నివేదికలో స్పష్టం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement