కార్మికుల కనీస వేతనాల పెంపు.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి
అన్‌స్కిల్డ్, సెమీస్కిల్డ్,స్కిల్డ్, హైస్కిల్డ్‌గా కార్మికుల విభజన
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా వేతనాల ఖరారు
కనీస వేతనాలు అమలు చేయని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి
గల్ఫ్ కార్మీకులకు సంబంధించి మంచి పాలసీతో వస్తామని వెల్లడి
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక సంఘాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వారు పనిచేసే గ్రామీణ/పట్టణ ప్రాంతాల ఆధారంగా వారి వేతనాలను సవరించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమ ల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ అనే రెండు జోన్లు ఉండగా, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్–1), మున్సిపాలిటీలు (జోన్–2), గ్రామీణ ప్రాంతాలు (జోన్–3) అనే మూడు జోన్ల ఆధారంగా వేతనాలను ఖరారు చేసింది. స్థానికంగా ఉండే ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలను పెంచింది. జోన్–1లో అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌తో కలిసి గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక వర్గానికి సీఎం ఈ తీపి కబురు వినిపించారు. వారికి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
‘కార్పొరేషన్లలో ఇళ్ల అద్దెలు, ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువ కాబ ట్టి అక్కడ ఎక్కువ వేతనాలను, మున్సిపాలిటీల్లో కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం తక్కువగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనాల పెంపును మే డే రోజే ప్రకటిద్దామనుకున్నా కొందరి సూచనల కోసం ఆలస్యమైంది. కనీస వేతనాల పెంపు అమలు చేయని పరిశ్రమలపై కార్మీక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. కార్మీకశాఖ ను ఇంకా బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్న పరిశ్రమల్లో 80% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా నిబంధన పెట్టేందుకు అవకాశం ఉంది..’ అని సీఎం అన్నారు.
నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ భద్రత
‘ఏఐ వచ్చాక వైట్ కాలర్ జాబ్ ఉద్యోగాలొచ్చే పరిస్థితీ, ఉద్యోగ భద్రతా లేదు. చాలా దేశాల్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కోట్లాది మంది ఐటీ రంగ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. సాఫ్ట్‌వేర్ చదివితే రూ.లక్ష ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ సాంకేతిక నైపుణ్యంతో కూడిన చదువులతో రూ.2 లక్షల ఉద్యో గం వచ్చే అవకాశం ఉంది. బ్లూకాలర్ జాబ్స్‌కు ప్రపంచంలో విస్తృత డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయ లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే జర్మనీ, జపా న్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్‌లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీ దగ్గర నైపుణ్యం కలిగిన వారుంటే పంపాల ని ఈ దేశాలు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఎంత మందిని పంపిస్తారని అడుగుతున్నాయి.
ఆ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ
స్కిల్స్ వర్సిటీ, ఐటీసీల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల అప్‌గ్రేడేషన్‌తో ప్రభుత్వం పూర్తిగా బ్లూకాలర్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో చేరితే నెలకు రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌లో చేరేవారి కోసం కూడా మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను నేర్పడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. జర్మనీ, చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్‌లో 80 శాతం మందికి ఆంగ్లం రాదు. సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ నాలుగైదు దేశాలే తీరుస్తున్నాయి. ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. ఏఐ తుపాన్‌లో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. బ్లూ కాలర్ స్కిల్ నేర్చుకుంటే 100 శాతం జీవిత భద్రత ఉంటుంది..’అని రేవంత్ అన్నారు. 
గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ
‘ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వ మే శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. స్కిల్స్ వర్సిటీలో ఆరు నెలల శిక్షణ నుంచి నుంచి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వరకు వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. గతంలో గల్ప్ కార్మీకులు చనిపోతే శవాలను సైతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాలను తీసుకొస్తున్నాం. గల్ఫ్ ఏజెంట్లు పడగలెత్తి పెద్దపెద్ద పదవుల్లోకి వచ్చారు. కానీ కార్మికులు మోసపోతున్నారు. గల్ఫ్ కార్మీకులకు సంబంధించి త్వరలో మంచి పాలసీతో వస్తాం..’అని సీఎం చెప్పారు. ప్రధాని ప్రతిదీ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కార్మీకుల కోణం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
సింగరేణిలో స్థానికులకే 80% ఉద్యోగాలు: మంత్రి వివేక్
సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు కార్మీక శాఖ మంత్రి జి.వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చెబుతున్నామని, హైస్కిల్డ్ ఉద్యోగాల విషయంలో వారిష్టమని అంటున్నామని చెప్పారు. కొత్తగా 56 ఏటీసీలను మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 118కి పెరగనుందన్నారు.


