సిగ్నల్ వద్ద ఆగిఉన్న వాహనాలపై ఆకస్మికంగా ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటన శుక్రవారం పుణే రైల్వే స్టేషన్ సమీపంలో షాహిర్ అమర్ షేక్ చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అప్పుడే తన భార్య అస్థికలను కలిపి వస్తున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హోర్డింగ్‌ను తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ బి.సింగ్ తెలిపారు. మృతి చెందిన వారిని కసర్ (70), షామ్ రావ్ ధోట్రె (48), శివాజీ పర్‌దేశీ (40), జావేద్ ఖాన్(40)లుగా గుర్తించారు.