'రహదారుల దిగ్బంధనాన్ని విజయవంతం చేయండి' | seemandhra supporters protests highways successfully: ysr congress party | Sakshi
Sakshi News home page

Nov 5 2013 3:11 PM | Updated on Mar 21 2024 5:15 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు, ఎల్లుండి రహదారుల దిగ్బంధనం చేయాలని నిర్ణయించామని, ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమైక్యవాదులుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్రం కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రహదారుల దిగ్బంధనంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. బుధ, గురువారాల్లో చేయాల్సిన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పెరేడ్లోముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు కలవలేదని ప్రశ్నించింది. సీమాంధ్ర ఆత్మగౌరవయాత్రల పేరుతో ఎవరిని మోసాం చేయాలనుకుంటున్నావంటూ వ్యంగ్యస్త్రాలను సంధించింది. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న అన్ని నిర్ణయాలను సీఎం కిరణ్ చాలా చక్కగా అమలు చేస్తున్నారని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో ముఖ్యమంత్రిగా కిరణ్ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఇప్పటివరకు 9368 గ్రామ పంచాయతీల నుంచి గ్రామ సభ తీర్మానాలను ప్రధాని, జీవోఎంకు మెయిల్ ద్వారాపంపించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా గుర్తు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement