breaking news
seemandhra supporters
-
'రహదారుల దిగ్బంధనాన్ని విజయవంతం చేయండి'
సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు, ఎల్లుండి రహదారుల దిగ్బంధనం చేయాలని నిర్ణయించామని, ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమైక్యవాదులుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్రం కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రహదారుల దిగ్బంధనంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. బుధ, గురువారాల్లో చేయాల్సిన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రయాణికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పెరేడ్లోముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు కలవలేదని ప్రశ్నించింది. సీమాంధ్ర ఆత్మగౌరవయాత్రల పేరుతో ఎవరిని మోసాం చేయాలనుకుంటున్నావంటూ వ్యంగ్యస్త్రాలను సంధించింది. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న అన్ని నిర్ణయాలను సీఎం కిరణ్ చాలా చక్కగా అమలు చేస్తున్నారని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో ముఖ్యమంత్రిగా కిరణ్ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఇప్పటివరకు 9368 గ్రామ పంచాయతీల నుంచి గ్రామ సభ తీర్మానాలను ప్రధాని, జీవోఎంకు మెయిల్ ద్వారాపంపించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా గుర్తు చేసింది. -
'రహదారుల దిగ్బంధనాన్ని విజయవంతం చేయండి'
-
సమైక్య 'సెగ’!
కర్నూలు నగరంలో ఏం జరిగింది మంత్రి టీజీ వెంకటేశ్ కాన్వాయ్‌ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ నినదించారు. కొందరు మంత్రి కారుపై చెప్పులు విసరడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కారు దిగి మీసం మెలేసి, తొడగొట్టారు. సిసలైన సమైక్యవాదిని తానేనంటూ హెచ్చరించడంతో సమైక్యవాదులు మరింత రెచ్చిపోయారు. టీజీ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. అంతలోనే టీజీ అనుచరులు కొందరు న్యాయవాదుల దీక్షా శిబిరంపై చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. కాన్వాయ్‌ని అడ్డుకున్న లాయర్లను అరెస్టు చేయడం మరింత వివాదానికి, రాస్తారోకోకు, ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. చివరికి వారిని పోలీసులు విడిచిపెట్టారు. సోమవారం టీజీ ఇల్లు, కార్యాలయాలను ముట్టడించనున్నట్టు సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించింది అనంతపురంలో ఏం జరిగింది: ‘తెలుగు తేజం’ యాత్రలో భాగంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ భేటీ వివాదాస్పదమైంది. ‘జేపీ గో బ్యాక్’ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర అనాలంటూ జేపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయన ‘జై తెలుగుతల్లి.. జై సీమాంధ్ర.. జై తెలంగాణ’ అని నినదించినా శాంతించలేదు. వారిపై జేపీ అసహనం వ్యక్తం చేశారు. చివరకు ‘జై ఆంధ్రప్రదేశ్’ అన్నారు. జనం ఉద్వేగంలో ఉన్నారంటూ యాత్రను వాయిదా వేశారు. సాక్షి నెట్వర్క: సీమాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ గట్టిగా తాకుతోంది. వారంతా పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేయాలని, సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న కోట్లాది మంది సామాన్యులతో కలిసి నడవాలనే డిమాండ్లు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ డిమాండ్లతో పలు పార్టీల నాయకులను, మంత్రులను సమైక్యవాదులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆదివారం కర్నూలులో మంత్రి టి.జి.వెంకటేశ్‌ను, అనంతపురంలో లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను సమైక్యవాదులు అడ్డుకున్నారు. లాయర్ల అరెస్టు.. ఉద్రిక్తత... కర్నూలులో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి టి.జి.వెంకటేశ్ కాన్వాయ్‌ని ఆదివారం సమైక్యవాదులు అడ్డుకుని, రాజీనామా చేయాలంటూ నినదించారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కారుపై చెప్పులు విసిరారు. దాంతో టీజీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కారు దిగి మీసం మెలేసి, తొడగొట్టారు. అసలు సిసలైన సమైక్యవాదిని తానేనంటూ ఆందోళనకారులను హెచ్చరించారు. దాంతో వారు మరింత రెచ్చిపోయారు. ‘మంత్రి టీజీ డౌన్... డౌన్...’, ‘గో బ్యాక్ టీజీ...’, ‘మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఆందోళనకారులను పక్కకు నెట్టి మంత్రి కాన్వాయ్‌ని అక్కడినుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అంతలోనే టీజీ అనుచరులు కొందరు న్యాయవాదుల దీక్షా శిబిరంపై చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అందరినీ చెదరగొట్టి మంత్రి కాన్వాయ్‌ని పంపించేశారు. అనంతరం కాన్వాయ్‌ని అడ్డుకున్న న్యాయవాదులను అరెస్టు చేసి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమైక్యవాదుల అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వందలాదిగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా వచ్చి సమైక్యవాదులకు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. సమస్య తీవ్రరూపం దాల్చడంతో అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేస్తున్నట్టు సీఐ ప్రకటించారు. ఆందోళనకారులు శాంతించారు. టీజీ వైఖరికి నిరసనగా సోమవారం అయన ఇల్లు, కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు చెన్నయ్య తెలిపారు. ఎస్వీ మోహన్‌రెడ్డిపై కేసు నమోదు వైఎస్సార్సీపీ నేత ఎస్.వి.మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో సమైక్య జేఏసీ నాయకులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని దాడికి యత్నించారని టీజీ కారు డ్రైవర్ ఖాజా హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్వీతో పాటు మరికొంతమంది దాడికి ప్రోత్సహించారనే ఫిర్యాదుపై ఐపీసీ 341, 520, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ అబ్దుల్ గౌస్ తెలిపారు. అనంతపురంలో జేపీకి సమైక్య సెగ ఇక జయప్రకాశ్ నారాయణకు అనంతపురంలో ‘సమైక్య’ సెగ తగిలింది. ‘తెలుగు తేజం’ పేరుతో ఆయన చేపట్టిన యాత్రలో భాగంగా ఉదయం 10 గంటలకు రామ్‌నరేశ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే అక్కడకు చేరుకున్న ఆందోళనకారులు ‘జేపీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర అనే వరకూ లోపలికి వెళ్లనీయబోమంటూ హాల్ ఎదుటే బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారితో జరిగిన తోపులాటలో పలువురు సమైక్యవాదులు స్వల్పంగా గాయపడ్డారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య జేపీ ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. ఆయన ప్రసంగిస్తుండగా సమైక్యవాదులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లారు. జై సమైక్యాంధ్ర అని నినదించే వరకూ ప్రసంగించేందుకు వీల్లేదంటూ అడ్డుకున్నారు. దాంతో లోక్‌సత్తా నేతలు, సమైక్యవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘జై తెలుగుతల్లి.. జై సీమాంధ్ర.. జై తెలంగాణ’ అని జేపీ నినాదాలు చేసినా, ‘జై సమైక్యాంధ్ర’ అనాల్సిందేనని సమైక్యవాదులు పట్టుబట్టారు. జాతి ప్రయోజనాల కోసం ప్రజలను జాగృతం చేసేందుకు వస్తే ఇలాగేనా వ్యవహరించేదంటూ వారిపై జేపీ అసహనం వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటలు హైడ్రామా సాగింది. రాష్ట్రం ముక్కలై సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిసి కూడా సమైక్యాంధ్ర కోసం ఎందుకు పాటుపడటం లేదంటూ జేఏసీల నాయకులు జేపీని నిలదీశారు. చివరకు ఆయన ‘జై ఆంధ్రప్రదేశ్’ అనడంతో శాంతించారు. పజలు ఉద్వేగంలో ఉన్న ఇలాంటి తరుణంలో యాత్ర నిర్వహించినా లాభముండదని జేపీ అన్నారు. పోలీసుల అనుమతి కూడా రద్దయినందున దాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్న చందంగా ప్రజాప్రయోజనాలపై పోరాడే నాయకుడికే ఆటంకాలు ఎదురవుతాయన్నారు. జై సమైక్యాంధ్ర అని నినదించాలంటూ శనివారం కర్నూలులో కూడా జేపీని సమైక్యవాదులు అడ్డుకోవడం తెలిసిందే. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలనే డిమాండ్‌తో మంత్రులు కిల్లి కృపారాణి, శత్రుచర్ల విజయరామరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు తదితరులను సమైక్యవాదులు కొద్ది రోజులుగా పదేపదే అడ్డుకుంటూ వస్తున్నారు.