సంక్రాంతికి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. పందెంరాయుళ్లు పెద్దమొ త్తాలతో బరిలో దిగేందుకు సన్నాహాలు ఏస్తున్నారు. హైకోర్టు నిషేధం విధించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికార పర్టీ నేతలే పోటీలకు నేతృత్వం వహిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గురువారమే కోడిపందేలు మొదలయ్యాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కోడిపందేలు మొదలుపెట్టేందుకు బరులు సిద్ధం చేశారు. ప్రధానంగా ఈ జిల్లాల్లో మూడురోజులు రూ.వందల కోట్ల పందేలు జరగనున్నాయి. సంక్రాంతి సమయంలో తమిళనాడులో జల్లికట్లు, ఏపీలో కోడి పందేలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆంక్షలు పెట్టిన సంగతి తెల్సిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాదని తమిళనాడులో గురువారం జల్లికట్టు నిర్వహించడంతో పోలీసులు దాడిచేసి నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మన రాష్ట్రంలో కోడిపందేలను హైకోర్టు నిషేధించడం, సుప్రీం ఆంక్షలను కొనసాగించడంతో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నేతలు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.