మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు తనయుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు పీవీ రాజేశ్వరరావు(70) సోమ వారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావు ఈ నెల 5న సోమాజిగూడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే తీవ్ర అస్వస్థతకు లోనై తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని ఆదర్శ నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. రాజేశ్వరరావు మరణవార్త తెలియగానే పీవీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీగా చేరుకున్నారు. వివిధ పార్టీల నేతలు నివాళి అర్పించారు. అమెరికాలో ఉన్న పీవీ కుటుంబీ కులు మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విష్పర్ వ్యాలీలో మహా ప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజేశ్వరరావుకు భార్య రాధిక, కుమారుడు రాఘవేంద్ర కశ్యప్ ఉన్నారు. కశ్యప్ రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రాజేశ్వరరావు మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సంతాపం తెలిపారు.