ఫిలిప్పీన్స్‌పై ‘హైయాన్’ కాటు | More than 10000 feared dead in typhoon-ravaged Philippines | Sakshi
Sakshi News home page

Nov 11 2013 7:09 AM | Updated on Mar 21 2024 6:35 PM

ప్రచండ తుపాను ‘హైయాన్’ ధాటికి ఫిలిప్పీన్స్ కకావికలమైంది. దేశంలోని ప్రధాన పట్టణాలన్నింటినీ కుదిపేసిన ఈ పెను తుపానులో ఆదివారం నాటికి 10 వేల మందికిపైగా మరణించారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 300 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడ్డ గాలుల ధాటికి సముద్రం అల్లకల్లోలమైంది. సునామీ తరహాలో మూడు మీటర్ల మేర ఎగిసిపడిన రాకాసి అలలు తీర ప్రాంతంలోని వేలాది ఇళ్లను నేలమట్టం చేశాయి. రహదారులన్నీ ముక్కలు చెక్కలయ్యాయి. రవాణా, సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశంలోని లైట్, సమార్, విసాయాస్, బికోల్, మిండనావ్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. లైట్ ప్రావిన్స్ రాజధాని టాక్లోబాన్ పట్టణం తుపానుతో చిగురుటాకులా వణికిపోయింది. దేశం మొత్తమ్మీద ఇక్కడే భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. శుక్రవారం ఉదయం ఈ పట్టణాన్ని హైయాన్ ముంచెత్తింది. వరదల్లో సర్వం కొట్టుకుపోవడంతో మూడ్రోజులుగా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక స్థానికులు అల్లాడుతున్నారు. ఆకలికి తాళలేక జనం షాపులు, మాల్స్‌పై పడి అందినకాడికి దోచుకుపోయారు. దుకాణాలపై దాడులు చేసి బియ్యం, పాలు, బ్రెడ్లు తదితర ఆహార పదార్థాలను ఎత్తుకుపోయారు. మరికొన్ని చోట్ల ఏటీఎంలను కొల్లగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. దాడులను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో పట్టణం అంధకారంలో మగ్గుతోంది. ఆదివారం ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో ఎస్ అక్వినో టాక్లోబాన్‌తోపాటు రోక్సాస్ పట్టణాల్లో పర్యటించారు. నెమ్మదిగా కొనసాగుతున్న సహాయక చర్యలు రోడ్లు తెగిపోవడం, సమాచార వ్యవస్థ కుప్పకూలడంతో వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాన్ని అధికారులు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఫోన్లు మూగబోవడంతో నష్టం వివరాలు అందడం లేదు. శాటిలైట్ ఫోన్ల ద్వారా మాత్రమే అధికారులకు అరకొర సమాచారం అందుతోంది. తుపాను ధాటికి చనిపోయినవారు వందల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. మృతుల సంఖ్య 10 వేల మందికిపైనే ఉండొచ్చని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెడ్‌క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఒక్క లైట్ రాష్ట్రంలోనే 10 వేల మంది దాకా చనిపోయి ఉండవచ్చని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ‘‘లైట్‌లో నష్టం చాలా ఎక్కువగా ఉంది. శనివారం రాత్రి గవర్నర్‌తో సమావేశమై పరిస్థితిని సమీక్షించాం. 10 వేల మంది దాకా మరణించినట్లు తెలుస్తోంది’’ అని పోలీసు చీఫ్ సూపరింటెండ్ ఎల్మర్ సోరియా తెలిపారు. హైయాన్ ప్రయాణించిన దిశలో 70 నుంచి 80 శాతం ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. లైట్ పొరుగు దీవి అయిన సమార్‌లో కూడా హైయాన్ బీభత్సం సృష్టించింది. టాక్లోబాన్‌లో వెయ్యికిపైగా శవాలు కొట్టుకుపోవడం చూశామని స్థానికులు చెప్పారు. చిన్న పట్టణమైన బసర్‌లో 300 మంది మరణించారని, మరో 2 వేల మంది ఆచూకీ తెలియడం లేదని సహాయక సిబ్బంది వెల్లడించారు. సుమారు 1,500 పునరావాస కేంద్రాల్లో 4 లక్షల మంది తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు రావడం, అగ్ని పర్వతాలు బద్దలవడం, తుపాన్లు విరుచుకుపడడం సాధారణమే అయినా ఇప్పటిదాకా ఇంత భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించలేదు. తుపానులో 10 వేల మంది చనిపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన చైనా.. ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన హైయాన్ తుపాను చైనాను వణికిస్తోంది. శనివారం సాయంత్రం దక్షిణ చైనా ఈశాన్య భాగంలోని హైనాన్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులను తుపాను తాకినట్లు ఆ దేశ వాతావరణ విభాగం తెలిపింది. హైయాన్‌ను అత్యంత ప్రమాదకరంగా ప్రకటిస్తూ ఆదివారం చివరి హెచ్చరిక (రెడ్ అలర్ట్)ను జారీ చేసింది. ముందస్తుగా హైనాన్‌లోని సాన్యా పట్టణంలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైకోవో, హైనాన్‌లోని ఎయిర్‌పోర్టుల ద్వారా వెళ్లాల్సిన 200 విమానాలను రద్దుచేశారు. వియత్నాంలో 6 లక్షల మంది తరలింపు.. ఇప్పటికే చైనాను తాకిన పెను తుపాను వియత్నాం దిశగా కదులుతోంది. తుపాను ప్రభావంతో దేశ రాజధాని హనోయ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు చర్యగా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement