గ్రూప్-1 మినహా అన్ని గ్రూప్స్ (గ్రూప్-2, 3, 4) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల (డీవోపీటీ) శాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. డీవోపీటీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కోతన్ రాసిన లేఖ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూనియర్ లెవల్ అధికారి పోస్టులకు ఇంటర్వ్యూలను నిలిపివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ లెవల్ పోస్టులకు ఎక్కడైనా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటే నిలిపివేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని డీవోపీటీ తన లేఖలో పేర్కొంది. అవినీతిని నిరోధించేందుకు, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు, నిరుపేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందులను దూరం చేసేందుకే ఈ చర్యను చేపట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించారని తెలిపింది.