ధన్‌తేరాస్ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.33,000కు చేరుతుందని నిపుణులు, బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ధన్‌తెరాస్ (నవంబర్ 1-శుక్రవారం)రోజున బంగారం కొనడం శుభప్రదమని నమ్మకం ఉంది. ఈ నమ్మకం కారణంగా ఆ రోజున బంగారం కొనుగోళ్లు జోరుగా ఉంటాయని, డిమాండ్ పెరుగుతుందని, కానీ సరఫరా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ధర పెరుగుతుందని వారంటున్నారు. కరెంట్ అకౌంట్ లోటును కట్టడి చేసేందుకు బంగారం దిగుమతులపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా బంగారం దిగుమతులు తగ్గాయని, దీంతో సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.300-1000 వరకూ పెరిగే అవకాశాలున్నాయని ఎస్‌ఎంసీ కామ్‌ట్రేడ్ సీఎండీ డి.కె.అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది ధన్‌తెరాస్ రోజున బంగారం ధర 20 శాతం పెరిగి రూ.32,485కు చేరింది. ధన్‌తేరాస్‌కు పసిడి ఆభరణాలకు డిమాండ్ స్థిరంగా ఉం టుందని నిపుణులంటున్నారు. ప్రభుత్వం నాణాలు, బంగారు కడ్డీల దిగుమతులను నిషేధించడం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండదని, ఫలితంగా వీటి అమ్మకాలు బాగా తగ్గుతాయని బాంబే బులియన్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సురేష్ హుండియా చెప్పారు. ప్రభుత్వ ఆంక్షలకు తోడు రూపాయి పతనం కారణంగా బంగారు నాణాలకు డిమాండ్ ఇప్పటికే 70%, ఆభరణాలకు డిమాండఖ 60% తగ్గిందన్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 28న న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.34,500కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ప్రస్తుతం బంగారం ధరలు న్యూఢిల్లీ మార్కెట్లో రూ.32,750గానూ, ముంబైలో రూ.31,700 గానూ ఉన్నాయి.
Oct 28 2013 12:32 PM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
Advertisement
