రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. విష జ్వరాలు, కలుషిత నీటి జబ్బులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన జ్వరాలతో ఊళ్లకు ఊళ్లే మంచం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాల బారినపడ్డ వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీతో ఎంతమంది మరణించారనే గణాంకాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో డెంగీ జ్వరాలకు వైద్యం లభించకపోవడంతో బాధితులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి, అప్పుల పాలవ్వాల్సి వస్తోంది.