ఆంధ్రప్రదేశ్‌కు వరప్రసాదియైన పోలవరం ప్రాజెక్టులో ‘పట్టిసీమ’ తరహా మరో దోపిడీకి ప్రభుత్వం తెరలేపింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ. 954 కోట్ల నుంచి ఏకంగా రూ.1638 కోట్లకు పెంచింది. రూ.1638 కోట్లతో పోలవరం ఎడమవైపున సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనామోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం కుడికాలువపై పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1600 కోట్లకు పైగా విడుదల చేసి దోచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇదే తరహాలో దండుకునేందుకు ఎడమ కాలువలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు -1, 2కు ఆమోదముద్ర వేశారని అధికార వర్గాలు అంటున్నాయి.