సంపద అసమానత్వం దేశంలో పెచ్చుమీరిపోతోంది. రోజులో రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంతో దేశంలో సుమారు 30 శాతం మంది ఒకవైపు అల్లాడుతుంటే... మరోవైపు దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే తిష్టవేసింది. ఈ అసమానత్వంలో ప్రపంచ సగటు రేటు 50 శాతాన్ని మన దేశం దాటేసింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా సంపన్నులు, ప్రముఖులు సమావేశం అవుతున్న తరుణంలో... ఈ వాస్తవాలను ఆక్స్‌ఫామ్ అనే హక్కుల గ్రూపు ‘యాన్ ఎకానమీ ఫర్ 99 పర్సెంట్’ పేరుతో సోమవారం విడుదల చేసింది.