●జనం గుండెల్లో ఏముందంటే! | - | Sakshi
Sakshi News home page

●జనం గుండెల్లో ఏముందంటే!

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

●జనం గుండెల్లో ఏముందంటే!

నాయకులు ఎంత వేషాలు వేస్తున్నా.. కడప జిల్లా ఓటర్లు మాత్రం చాలా తెలివి మీరిపోయి షార్పుగా ఉన్నారు. హారతి ఇచ్చేటప్పుడు నాయకుడి వంక చూసి లోలోపల నవ్వుతున్నారు. లడ్డూ ప్రసాదం తింటున్నారు, చందాలు లాగుతున్నారు. కానీ లోపల మాత్రం ‘నువ్వు ఎలక్షన్లు అవ్వగానే మళ్లీ వచ్చే ఏడాది దాకా కనిపించవని మాకు తెలుసులే లీడరూ...’ అని నవ్వుకుంటున్నారు. ఓట్ల కోసం పిల్లి లాగా నక్కి వస్తున్న ఈ రాజకీయ నాయకులకు వినాయకుడే బుద్ధి ప్రసాదించాలి. లేదంటే జనం ఈసారి మాట తప్పిన లీడర్ల భవిష్యత్తును కూడా నిమజ్జనం చేయడం ఖాయం.

బద్వేలు: వినాయక చవితి పండుగ జోరుగా జరుగుతోంది. విఘ్నేశ్వరుడు బుద్ధిగా పీఠం మీద కూర్చుంటే, ఆయన కంటే బుద్ధిమంతుల్లా నటిస్తూ మన స్థానిక సంస్థల భావి కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీ అభ్యర్థులు మండపాల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. ఏటా భక్తితో అడపాదడప వచ్చే నాయకులు ఈసారి మాత్రం గుంపులు గుంపులుగా శక్తికి మించి ఊగిపోతూ స్వామివారి సేవకు పరుగులు పెడుతున్నారు. కారణం వినాయక నవరాత్రులు ముగియగానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే! స్వామి వారి లడ్డూ కంటే, ఓటరు దేవుడి ఓటు మీదనే మన లీడర్ల కన్ను పడింది. వైఎస్సార్‌ జిల్లాలోని అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో, వీధి వీధినా సాగుతున్న ఈ భక్తి రాజకీయ ప్రహసనం ప్రత్యేకతను సంతరించుకుంది.

స్వామి ముందు రాజకీయ వినతులు

ఎప్పుడూ గల్లీ వైపు కన్నెత్తి చూడని పెద్ద మనుషులు కూడా ఇప్పుడు చేతులు కట్టుకుని ఏ సందులో గణపతి ఉంటే అక్కడికి దూరిపోతున్నారు. అయితే వాళ్లు గణపతి ముందు నిల్చుని అడుగుతోంది ఆయురారోగ్యాలు కాదు, ‘స్వామీ! ఎలాగైనా ఈసారి మా పార్టీ టికెట్‌ మాకే వచ్చేలా చూడు తండ్రీ! అవతలి వార్డులో నా ప్రత్యర్థికి డిపాజిట్‌ రాకుండా చెయ్‌’ అని మనసులోనే మైకులు పెట్టి ప్రార్థిస్తున్నారు. బద్వేలులోని ఒక మండపంలో ఓ ఆశావహుడు ఏకంగా 21 కేజీల లడ్డూ వేలంలో పాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ లడ్డూ కొంటే వార్డులోని 400 బీసీ ఓట్లు, 200 ఎస్సీ ఓట్లు తన ఖాతాలోకి ఫ్రీగా బదిలీ అయిపోతాయన్నది ఆయన మాస్టర్‌ ప్లాన్‌ .

దేవుడి మైకు.. ఓట్ల లొల్లి

గతంలో వినాయకుడి మండపాల వద్ద భక్తి పాటలు వినిపించే మైకులు, ఇప్పుడు నాయకుల ఆత్మస్తుతికి వేదికలయ్యాయి. కడప నగరంలోని ఒక సందులో అధికార పార్టీ లీడరొకరు మైకందుకుని, ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఎన్నికల్లో నన్నే గెలిపించాలయ్యా’ అంటూ రైమింగ్‌ డైలాగులు కొడుతున్నారు. వీధిలో డ్రైనేజీ, రోడ్ల గుంతలు, తాగునీరు రావాలన్నా ఓట్లు వేయాలని మైకు ముందు అరిచి గీపెడుతున్నారు. ఇదంతా చూస్తున్న వినాయకుడు ‘అయ్యా లీడరూ! నువ్వు గత ఐదేళ్లుగా ఇక్కడే కౌన్సిలర్‌వి కదా, అప్పుడు చేయని పనులు ఇప్పుడు నా మీద తోస్తావేంటయ్యా!’ అని లోపల లోపలే తల పట్టుకున్నాడు.

నా ఫ్లెక్సీ పెద్దదా? నీ ఫ్లెక్సీ పెద్దదా?

మండపాల వద్ద సరికొత్తగా ఫ్లెక్సీల యుద్ధం కూడా మొదలైంది. కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు వినాయకుడి కంటే పెద్ద సైజులో నాయకుల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. దేవుడి బొమ్మ మూలన ఉంటే, దానికి ఐదు రెట్లు పెద్దగా లీడర్ల ఫోటోలు కనిపిస్తున్నాయి. తనకంటే ప్రత్యర్థి ఫ్లెక్సీ పెద్దగా ఉంటే, అర్థరాత్రి పూట అనుచరులను పంపించి కొలతలు తీయించేంత ‘క్యాన్వాస్‌ రాజకీయం’ నడుస్తోంది.

చందాల దందా.. బిజినెస్‌ కాలిక్యులేషన్‌

సాధారణంగా మండప నిర్వాహకులు చందాల కోసం ఇళ్ల చుట్టూ తిరుగుతారు. కానీ ఈసారి సీన్‌ రివర్స్‌ అయింది. లీడర్లే ఫోన్లు చేసి, చందాలు ఇస్తామని.. కాకపోతే అన్నదానం దగ్గర తమ బ్యానర్‌ కట్టాలని, మొదటి హారతి తమకే ఇవ్వాలని కండిషన్లు పెడుతున్నారు. పులివెందుల, జమ్మలమడుగు ఏరియాల్లో అయితే ఒకరు ఐదు వేలు ఇస్తే, మరొకరు పోటీ పడి పదివేలు ఇస్తున్నారు. ఇప్పుడు రూపాయి ఖర్చుపెడితే రేపు ఎన్నికల్లో వంద రూపాయలు సంపాదించుకోవచ్చనే ‘బిజినెస్‌ కాలిక్యులేషన్‌’ ఇక్కడ బాగా పనిచేస్తోంది.

వినాయక మండపాల సాక్షిగా

గల్లీల్లో మొదలైన ఆశావహుల

‘స్థానిక’ రాజకీయం

లడ్డూల వేలం వెనుక ఓట్ల లెక్కలు.. చందాల పోటీ వెనుక లాభనష్టాల బేరీజు

లీడర్ల నక్కవినయాలను కనిపెడుతూ లోలోపల నవ్వుకుంటున్న ఓటర్లు

‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఎన్నికల్లో

నన్నే గెలిపించాలయ్యా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement