తాగునీటి సమస్య రాకూడదు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య రాకూడదు

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

నీటి వనరుల అనుసంధానంపై

సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

బద్వేలు అర్బన్‌ : బద్వేలు నియోజకవర్గంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా బద్వేలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాశినాయన మండలంలోని బొక్కినేరు వాగు కాలువ ద్వారా నీటిని ఎల్‌ఎస్‌పీ ప్రాజెక్టుకు అందించి అక్కడ నుంచి బద్వేలు, పోరుమామిళ్ల ప్రాంతాల్లోని చెరువులకు నీటిని సరఫరా చేసే అవకాశాలను పరిశీలించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ నీటివనరుల అనుసంధానం ద్వారా కాశినాయన, బి.కోడూరు, పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు కలెక్టర్‌కు వివరించగా అందులో ఉన్న నీటి వనరుల సామర్థ్యం, కాలువ పరిస్థితి, నీటిని తరలించే మార్గాలు, అవసరమైన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

మౌళిక వసతుల పనుల్లో వేగం పెంచండి

బద్వేలు మున్సిపాలిటీని మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు, అభివృద్ధి పనులను యుద్ధ్దప్రాతిపదికన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రతి రోజూ వచ్చే 35.1 మెట్రిక్‌ టన్నుల చెత్తను వంద శాతం సేకరించి తడి, పొడి చెత్తగా వేరు చేసి ప్రాసెసింగ్‌ చేయాలని సూచించారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులను వేగవంతం చేసేందుకు అదనంగా 25 మంది పారిశుద్ధ్య కార్మికులను మంజూరు చేశారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఏడుకొండలు, ఇరిగేషన్‌ ఈఈ మురళి, స్మార్ట్‌ కిచెన్స్‌ నోడల్‌ అధికారి జోయల్‌విజయకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ క్రిష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement