పెండ్లిమర్రి : పెండ్లిమర్రి పోలీసు స్టేషన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లు, రైతుల వ్యవసాయ మోటర్ల కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు కడప రూరల్ సీఐ చల్లని దొర తెలిపారు. నందిమండల గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో పూల్లగూర రాజ్‌కుమార్, సిగా బయన్నలు అనుమానంగా తిరుగుతూ ఉండడంతో విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ధ్వంసం చేసి కాపర్ వైర్లు, మోటర్లు కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు వెల్లడించారన్నారు. వారి వద్ద నుంచి సుమారు 10కేజీల కాపర్ వైరు, 200 మీటర్ల కేబుల్ వైరు, దాదాపు రూ.70వేలు విలువచేసే చోరీ సోత్తును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుల్లో వీరిని నిందితులుగా చేర్చామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తులసి నాగప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు.


