● ఈదురుగాలులకు దెబ్బతిన్న
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు
● వారం రోజులుగా
సరఫరాలో అంతరాయం
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న
ట్రాన్స్‌కో అధికారులు
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ కొత్తపల్లె గ్రామంలో వ్యవసాయానికి సంబంధించి వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వానకు తోటల వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిని పడిపోయాయి. ఈ నేపథ్యంలో సంబంధిత రైతులు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయిన వాటి వివరాలను సేకరించి వెళ్లిపోయారు. మల్లికార్జునపురం గ్రామంలో సుమారు 200 ఎకరాలలో మిరప, 100 ఎకరాలలో అరటి పంటలను సాగు చేశారు. ఈ పంటలను కాపాడుకోవాలంటే నీటితడులు అందించాల్సి ఉంది. కానీ వారం రోజులుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించకపోతే పంట ఎదుగుదల రాదని వారు వాపోతున్నారు. జనరేటర్‌ల ద్వారా నీటి తడులు అందించాల్సి వస్తోందని తెలిపారు. వారం రోజులవుతునన్నా సంబంధిత అధికారులు ఇప్పటికీ నేలకూలిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పనులను వేగవంతంగా చేయడం లేదని వాపోతున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సుమారు 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి మల్లికార్జునపురం గ్రామ పొలాల్లో పడిపోయిన విద్యుత్ స్తంభాలను బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


