ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు మంగళవారం సాయంత్రం పరస్ప రం రాళ్లు దాడులు చేసుకోవడంతో ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పోలీసులు, ప్రజలు టెన్షన్‌గా ఉన్నారు. ఇందులో భాగంగానే కడప నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఇల్లు, ఆయన ఫిర్యాదు చేసిన ఎస్‌ఎస్ మాల్ సమీపంలోనే ఉన్నాయి. సాయంత్రం ఇరువర్గాల వారు అటు ఎస్‌ఎస్ మాల్ వద్ద, ఇటు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంట్టి వద్ద కాపు కాసి కూర్చున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానాడు కార్యక్రమంలో జరుగుతున్న వేళ ప్రొద్దుటూరులోని టీడీపీ వర్గాల మధ్య ఈ పరిస్థితి చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అప్పుడు, ఇప్పుడు వారే బాగు పడ్డారు
ఈ సందర్భంగా జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ వర్గీయులపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు దాడి చేసిన సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారే ఎమ్మెల్యే వరద వెంట లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లిన వారిని వదిలేసి రెండు ప్రభుత్వాల్లో లబ్ధి పొందుతున్న వారి విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానన్నారు.


