కడప అగ్రికల్చర్: జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పనిచేస్తున్న సతీష్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈయనను అడ్మినిస్టేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా జి.రమణారెడ్డి, రాష్ట్ర పంచాయితీరాజ్ విభాగం కార్య దర్శిగా కె.దశరథరామిరెడ్డిలను నియమించారు.
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఉదయం సెషన్‌లో 46 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు 222 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 51 మంది గైర్హాజరయారు. అలాగే సెకండియర్‌కు సంబంధించి మధ్యాహ్న సెషన్‌లో నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించి 162 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 11 మంది గైర్హాజరయారు.
మదనపల్లె సిటీ: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 25వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధికారులతో కడప కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి తెలిపారు. వెనుబడిన కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధా రణ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు అందజేయాలన్నారు.
మదనపల్లె సిటీ: ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌డబ్యూఆర్‌ఈఐ సొసైటీ జిల్లా సమన్వయ అధికారిణి ఏ.ఉదయశ్రీ తెలిపారు. కడప చిన్నచౌక్‌లోని అంబేద్కర్ గురుకులంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఐదో తరగతి బాలికలకు ఈనెల 26న, బాలురకు 27న.. ఇంటర్ మొదటి ఏడాది బాలికలకు ఈనెల 29న, బాలురకు 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఖాళీగా ఉన్న సీట్లను ఎంపిక చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలోని పాత వాహనాలను నిబంధనల ప్రకారం ఈ నెల 30న వేలం నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరుపయోగంగా ఉన్న ఏడు పాత ఎస్‌హెచ్‌టీఓ వాహనాలకు ఈ నెల 30న వేలం వేయుటకు కమిటీ తీర్మానం చేసింది. గుర్తింపు పొందిన వేలం పాటదారులు ఏపీ. జిఓవి. ఇన్ వెబ్‌సైట్‌లో కనీస రుసుం చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని ఆ కమిటీ చైర్ పర్సన్, డీఎంహెచ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో ఏఓ విజయ భాస్కర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్ ఖాన్, అసిస్టెంట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ జీవీ రఘునాధవర్మ పాల్గొన్నారు.
కడప రూరల్: రాయలసీమ రీజినల్ ఎడ్యుకేషన్ ఫెయిర్–2026ను ఈ నెల 24న కడప నగరంలోని విష్ణుప్రియ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆర్‌ఆర్ కెరీర్ సొల్యూషన్స్ ఎండీ రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 24న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఫెయిర్ ను నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిప్లమా, డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు ఎటువంటి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తెలుసుకోవచ్చన్నారు. ఈ ఫెయిర్‌లో దేశంలోని 100కు పైగా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొనవచ్చని వివరించారు.


