సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్‌మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అటు కడప, ఇటు కొండాపురంలో జరిగిన సమావేశాల సరళి చూస్తే, కేవలం తన చుట్టూ భజన చేసే ‘అనుకూల’ వర్గానికే లోకేష్ పెద్దపీట వేశారని, జెండా మోసిన కార్యకర్తలను రోడ్డుపై నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్‌వాన్ వద్దే వరదరాజులరెడ్డికి అవమానం
రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి లోకేష్ పర్యటనలో తీవ్ర అవమానం ఎదురైంది. శుక్రవారం ఉదయం లోకేష్‌ను కలిసేందుకు మైనార్టీ నేత ముక్తియార్‌తో కలిసి వరదరాజులరెడ్డి ఆయన కార్‌వాన్ వద్దకు వచ్చారు. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మె ల్యే, సీనియర్ నేత అని కూడా చూడకుండా.. ‘ముందస్తు అనుమతి లేదు, అపాయింట్‌మెంట్ కష్టమే‘ అంటూ లోకేష్ పర్సనల్ సెక్రెటరీ ముఖం మీదే చెప్పేయడం గమనార్హం. దాదాపు గంటసేపు పడిగాపులు కాసినా లోకేష్ నుంచి పిలుపు రాకపోవడంతో, వరదరాజులరెడ్డి తీవ్ర అవమానంతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే ఇక తమ గతేంటని ‘తెలుగు తమ్ముళ్లు’ చెవులు కొరుక్కుంటున్నారు.
జాతీయ ఉపాధ్యక్షుడికే స్టేజీ కింద స్థానం
దీనికి ముందు గురువారం సాయంత్రం జరిగిన కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ అవమానాల పర్వం కొనసాగింది. పార్టీ జెండానే సర్వస్వంగా భావించే ఎంతోమంది కిందిస్థాయి నాయకులకు ఈ సమావేశంలో అసలు అనుమతే దక్కలేదు. ఒకవేళ లోపలికి వెళ్లగలిగినా, సీనియర్లకు దక్కిన మర్యాద శూన్యం. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి లాంటి కీలక నేతలను సైతం స్టేజీపైకి రానివ్వలేదు. వీరంతా స్టేజీ కిందనే కూర్చోవాల్సి రావడంపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
కోటరీతోనే ఏకాంత చర్చలు
ప్రజాప్రతినిధి అయిన వరదరాజులరెడ్డిని గంట ల తరబడి బయట నిలబెట్టిన లోకేష్.. అదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఇన్‌ఛార్జీ గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కార్‌వాన్ లోపలికి పిలిపించుకుని ఏకాంత చర్చలు జరపడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం తనకు అనుకూలంగా ఉండే వారికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కష్టజీవులకు మొండిచేయి ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. లోకేష్ రెండు రోజుల పర్యటన జిల్లా టీడీపీలో తీవ్ర నైరాశ్యాన్ని, అసంతృప్తిని మిగిల్చింది.
సీనియర్లకు నో ఎంట్రీ..కోటరీకే పెద్దపీట
గంటసేపు పడిగాపులు కాసినాఎమ్మెల్యేకు దక్కని అపాయింట్‌మెంట్
జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్,రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డిలకుస్టేజీ కిందనే సీట్లు


