జమ్మలమడుగు/కొండాపురం:కొండాపురం మండలంలో సోలార్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి నారా లోకేష్.. గండికోట ముంపు నిర్వాసితుల పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానిక నేతలు ముంపు పరిహారం సమస్యను వివరించగా.. లోకేష్ తన ప్రసంగంలో పరిహారం ఇవ్వాలని మాత్రమే చెప్పారు కానీ, ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దాటవేశారు. మరోవైపు ముంపువాసులను కాకుండా కేవలం అనుకూల వర్గాలకే పాసులు ఇచ్చి ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై టీడీపీ క్షేత్రస్థాయి క్యాడర్ మండిపడింది. ‘ఎన్నికల్లో జెండాలు మోయడానికే మేం కావాలా?‘ అంటూ సొంత పార్టీ నాయకులే నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.మరోవైపు గండికోట ముంపువాసులు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో చెప్పి న హామీ ప్రకారం అదనపు పరిహారం ప్రస్తావనే లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ పర్యటన వేళ పోలీసుల జులూం
మంత్రి లోకేష్ పర్యటన వేళ పోలీసులు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అరాచకానికి తెరలేపారు. మండలంలో సోలార్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరూ ఇక్కడ ఉండకూడదంటూ తెల్లవారకముందే ఇళ్లపైకి వాలారు. ఊళ్లో ఉంటే పీఎస్‌లో కూర్చోవాలని, లేదంటే మండలం దాటాలని హుకుం జారీ చేశారు. లోకేష్ కు గండికోట ముంపు సమస్యలపై వినతులు ఇవ్వకూడదని, ఆ ప్రస్తావనే తేవద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలు హరినారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ప్రవీణ్‌లకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ప్రశ్నిస్తారనే భయంతోనే తమ గొంతు నొక్కుతున్నారని హరినారాయణరెడ్డి మండిపడ్డారు. మరోవైపు కొండాపురంలో నిలదీస్తున్న సీపీఐ నాయకుడు మనోహర్‌బాబుతో పాటు నలుగురిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.
పరిహారంపై తేల్చని లోకేష్


