ప్రజల గుండెల్లో పెద్దాయన | - | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో పెద్దాయన

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

వైఎస్‌ఆర్‌ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు

పులివెందుల పెద్దాయనగా

ప్రజల మన్ననలు

నేడు దివంగత వైఎస్‌ రాజారెడ్డి

28వ వర్ధంతి

పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలుస్తూ..కరువు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆదుకున్న నాయకుడు దివంగత వైఎస్‌ రాజారెడ్డి. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి బిజీగా ఉన్నా పులివెందులలో అంతా తానై నడిపించేవారు. వైఎస్‌ రాజారెడ్డి 1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరిని ఏకతాటిపై నడిపించిన దివంగత వైఎస్‌ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. అంతేకాకుండా పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్‌గా ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది.

పులివెందుల గ్రామ సర్పంచ్‌గా..

రాజకీయాల్లోకి రాకముందు నుంచి పులివెందుల్లో వై.ఎస్‌.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం.ఈ నాటికి ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్‌గా 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు అన్నింటా తానే ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. రైతులను అన్నివిదాలా ఆదుకున్న దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కృషికి తోడుగా అక్కడక్కడ పెద్దాయన పేరుతో కూడా సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో రూపుదిద్దుకున్నాయి. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు కూడా వెలిశాయి.

పులివెందుల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం

దివంగత వైఎస్‌ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు పులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్‌ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవాడు. ప్రజలు కూడా తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలువబడే వైఎస్‌ రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. ప్రజల కోసం వైఎస్‌ రాజారెడ్డి ఇంటి వాకిళ్లు ఎప్పుడు తెరిచి ఉండేవి. అంతేకాకుండా దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్‌ రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్‌ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవాడు. దీంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రశాంతంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించేవాడు. వైఎస్‌ రాజారెడ్డి తనయుడు వైఎస్‌ఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవాడు.

విద్యా ప్రదాతగా.. :

దివంగత వైఎస్‌ రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాల్‌టెక్నికల్‌ కళాశాలలు నెలకొల్పాడు. వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్సార్‌లు చూపిన బాటలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికి పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.

నివాళులర్పించనున్న

వైఎస్‌ కుటుంబ సభ్యులు

దివంగత వైఎస్‌ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధుల తోటలో గల వైఎస్‌ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ, వైఎస్సార్‌ సోదరుడు వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, ఇతర కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్‌ రాజారెడ్డి పార్కులోని వైఎస్‌ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement