వేంపల్లె : స్థానిక చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీలో దాదాపు రూ.2కోట్ల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. దీంతో పులివెందుల కో–అపరేటవ్ బ్యాంకు సబ్ డివిజనల్ అధికారి కమలమ్మను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం చింతలమడుగుపల్లె సొసైటీలో విచారణ చేపట్టేందుకు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న కత్తులూరు, అలిరెడ్డిపల్లె, వేంపల్లె, చింతలమడుగుపల్లెతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు మూకుమ్మడిగా చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకుని విచారణ అధికారి కమలమ్మను తమకు అన్యాయం జరిగిందని చుట్టుముట్టారు. అలాగే సొసైటీ కార్యాలయానికి రైతులు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో చింతలమడుగుపల్లె సహకార సొసైటీలో సీఈఓగా పనిచేసిన రామిరెడ్డి అవినీతికి పాల్పడినట్లు బయారెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పుల్లయ్య, సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామానందరెడ్డిలతోపాటు పలువురు రైతులు అరోపించారు. సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చింతలమడుగుపల్లె సొసైటీలో వివిధ రకాల రుణాలను 1400మంది రైతులు తీసుకున్నట్లు తెలిపారు. పంట రుణాల్లో సీఈఓ రామిరెడ్డి 9 శాతం వడ్డీని వసూలు చేయాల్సి ఉండగా.. 12 శాతం వరకు వసూలు చేసినట్లు అరోపించారు. 12ఏళ్ల నుంచి సీఈఓ రైతుల నుంచి అధిక వడ్డీని వసూలు చేసి తన జేబులో వేసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీ, ఇతర రుణాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఒక్కో రైతుకు సంబంధించిన రుణాల్లో రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు స్వాహా చేసినట్లు అరోపించారు. రూ.కోట్లల్లో అవినీతి చేసిన సీఈఓ రామిరెడ్డిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప.. సీఈఓపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 5 సార్లు విచారణ చేశారని, సీఈఓ చేసిన అవినీతి బయటపడినా కూడా అధికారులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణాల వడ్డీ రెన్యువల్ చేయకుండా కోట్ల రూపాయలను వ్యవసాయ సహకార సంఘం సీఈవో రామిరెడ్డి మింగేశాడని వాపోతున్నారు. అనంతరం సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని విచారణ అధికారిణి కమలమ్మకు రైతులు రాతపూర్వకగా వినతి పత్రం అందజేశారు. సీఈఓ రామిరెడ్డిపై వచ్చిన అరోపణలపై విచారణ అధికారి కమలమ్మను వివరణ కోరగా.. ప్రజా సమస్యల వేదికలో కత్తులూరుకు చెందిన బయారెడ్డి, ప్రతాప్ రెడ్డిలు చింతలమడుగుపల్లె సహకార సొసైటీ సీఈఓ రామిరెడ్డిపై పిర్యాదు చేశారని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప కోఅపరేటవ్ బ్యాంకు ఉన్నతాధికారులు తనను విచారణ అధికారిగా వేయడంతో వేంపల్లె సొసైటీ కార్యాలయానికి వచ్చానన్నారు. రాత పూర్వకంగా రైతులు వినతి పత్రం అందజేశారన్నారు. విచారణలో సీఈఓ రామిరెడ్డి అవినీతికి పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని తెలిపారు.


