జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు ! | - | Sakshi
Sakshi News home page

జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు !

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

ఒకరిపై దాడి చేశారని ఫిర్యాదు :

నలుగురిపై కేసు

యువకులపై కానిస్టేబుల్‌ దాష్టీకం

కడప అర్బన్‌: కడప వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న చంద్ర నారాయణరెడ్డి ఓ కేసులో నిందితులుగా ఉన్న యువకులను పిలిపించి వారిని కొట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు మరింత రాజుకుంది. ఈ సంఘటనపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనసేన నాయకులైన హరిరాయల్‌, తాతంశెట్టి నాగేంద్రలు పరస్పరం సోషల్‌ మీడియా వేదికగా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తాతం శెట్టి నాగేంద్ర తనకు దగ్గరగా ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు యువకులను మరో నాయకుడైన హరి రాయల్‌పై దాడికి పంపించాడు. దీనిపై హత్యాయత్నం కేసును నమోదు చేయాలని హరిరాయల్‌ పోలీసులను పట్టుబట్టారు. దీంతో ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు కడప వన్‌ టౌన్‌ సీఐ వి. చిన్న పెద్దయ్య సంఘటన పై విచారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితులుగా ఉన్న నలుగురు యువకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. సదరు కేసులో నిందితులకు 41–ఏ నోటీసులు ఇచ్చి పంపిస్తామని చెప్పి సీఐ ఇతర విధులకు వెళ్లాడు. ఆ సమయంలో ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ చంద్ర నారాయణరెడ్డి అత్యుత్సాహం చూపారు. ఈకేసులో ఫిర్యాదుదారుడు, జనసేన నాయకుడైన హరి రాయల్‌ ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అతని ముందే కానిస్టేబుల్‌ యువకులను కొట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు. యువకులు గాయపడ్డారు. తర్వాత విధులనుంచి వచ్చిన సీఐ ఎదుట హాజరు పరిచి వారికి 41– ఏ నోటీసులను ఇచ్చి పంపించేశారు. కాగా ఈ సంఘటన శుక్రవారం సోషల్‌ మీడియాలో యువకుల శరీరాలపై గాయాలతో కూడిన ఫొటోలతో జోరుగా ప్రచారం సాగింది. ఈ సంఘటనపై కడప వన్‌ టౌన్‌ సీఐ చిన్న పెద్దయ్య ను వివరణ కోరగా, జనసేన నాయకుడు హరి రాయల్‌ పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీస్‌ స్టేషన్‌ కు పిలిపించి విచారించామని, వారికి 41– ఏ నోటీసులు ఇచ్చి పంపించామని తెలియజేశారు. కానిస్టేబుల్‌ వారిపై దాడి చేశారన్న విషయం తమ దష్టికి రాలేదని, దీనిపై సమగ్రంగా విచారిస్తామన్నారు. కాగా ఈ సంఘటనలో నలుగురు యువకులను హరి రాయల్‌ పై దాడి చేసేందుకు పంపించిన మరో జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తనను తాను కాపాడుకునేందుకు, పోలీసుల నుంచి తనపట్ల ఎలాంటి చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు ఆస్కారం లేకుండా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement