కడప అర్బన్: కడపలోని బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ వివరాల మేరకు వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ చాన్ (33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం బాడుగకు రాజంపేటకు వెళ్లి తిరిగి అదే రోజున ఇంటికి రాత్రి 9.30కు బయలుదేరాడు. వైఎస్సార్ కాలనీకి వెళ్లేందుకు ఆటో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బీబీజాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిఽధిలోని చౌడూరు గ్రామంలో గుర్తు తెలియని బైక్ ఢీ కొని నాగిరెడ్డి (77) అనే వృద్ధుడు మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చౌడూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి గురువారం రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని బైక్ అతన్ని ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి..
వల్లూరు : మండల పరిధిలోని గోటూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై అట్లూరి భాస్కర్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు...భాస్కర్ తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై గాయపడ్డాడు. బంధువులు చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని భార్య నాగ రత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ నాగిరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మహిళ అదృశ్యంపై కేసు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన గజ్జపనేని సంజీవమ్మ అనే వివాహిత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంజీవమ్మ ఈ నెల 20న టాట్లెట్లు తీసుకొని వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఇంత వరకు తిరిగి రాలేదు. తెలిసిన వాళ్ల ఇళ్లలోనూ. బంధువుల ఊళ్లలో విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్‌ఐ షేక్ మహబూబ్‌బాషా తెలిపారు.


