● అడ్డుకున్న టీడీపీకి చెందిన మరో వర్గం
● ఇరువర్గాల మధ్య ఘర్షణ
సునీల్ కుమార్ రెడ్డి వర్గాన్ని నివారిస్తున్న బద్వేలు సీఐ రామకృష్ణ, రెడ్డయ్య వర్గాన్ని నివారిస్తున్న ఎస్‌ఐ నాగకీర్తన
అట్లూరు : మండల కేంద్రమైన అట్లూరు రెవెన్యూ పొలంలోని కడప – బద్వేలు ప్రధాన రహదారి పక్కనే సర్వే నంబర్ 1007/3లో 32 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలాన్ని 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గుర్తించి పంపిణీకి రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి తహసీల్దార్ అట్లూరు మండల పరిధిలోని ఉన్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున లే అవుట్ వేసి జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. అనంతరం టీడీపీకి చెందిన పోతిరెడ్డి రెడ్డయ్య ఆ స్థాలాన్ని కబ్జాకు యత్నించడంతో అప్పటి రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వం స్థలం ఎవరైనా ఆక్రమణకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం ఉదయం ఆ స్థలానికి పక్కనే బోవిళ్ల సునీల్‌కుమార్‌రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన స్థలం ఉండటంతో ఈ స్థలంలో నుంచి రస్తా కావాలని జేసీబీతో సుమారు 50 మందితో అక్కడికి చేరుకుని పనులు చేపట్టారు. పోతిరెడ్డి రెడ్డయ్యతోపాటు ఆయన అనుచర వర్గం ఇక్కడికి చేరుకుని ఈ స్థలం తనదని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్‌ఐ నాగకీర్తన, బద్వేలు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ రంగారావు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వారిని స్టేషన్‌కు తరలించారు. జేసీబీని సీజ్ చేశారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ సుబ్బలక్షుమ్మను వివరణ కోరగా ఈ స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు బద్వేలు ఆర్డీఓ పరిశీలిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


