జీరో లాగిన్‌ ఫీజుతో గృహ రుణాలు | - | Sakshi
Sakshi News home page

జీరో లాగిన్‌ ఫీజుతో గృహ రుణాలు

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

కడప కార్పొరేషన్‌: ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో జీరో లాగిన్‌ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ పంకజ్‌ గాడ్గిల్‌ అన్నారు. కడపలోని ఎన్‌జీవో కాలనీలో యాక్సిస్‌ బ్యాంకుపైన ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన బ్రాంచి ప్రారంభోత్సవం సందర్బంగా జీరో లాగిన్‌ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిత్య బిర్లా దేశ వ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించిందని, కడప శాఖ ద్వారా మొత్తం బ్రాంచీల సంఖ్య 13కు చేరిందన్నారు. .

జోరుగా నిషేధిత లాటరీ వ్యాపారం

పుంగనూరు: పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పుమొగసాల, సెంటర్‌లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్‌ఎస్‌.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చిన్నారి నోటికి చేపల గాలం

కలకడ : చేపలను పట్టేందుకు వేసే గాలం చిన్నారి బేబీ(2)కి ఆడుకునే బొమ్మలా అనిపించడంతో నోటిలో పెట్టుకుంది, దీంతో అదికాస్త నోటిలో చిక్కుకున్న సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన రవి దంపతులు కలకడ మండలం గుడిబండ సమీపంలో తాత్కాలిక షెడ్లు వేసుకుని నెల రోజుల నుంచి నివాసం ఉంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటల్లోని ముళ్లపొదలు, కంపచెట్లు కొట్టి బొగ్గులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి చిన్నారి షెడ్‌లో ఆడుకుంటూ చేపల గాలాన్ని నోట్లో పెట్టుకొని లాగడంతో ఇరుక్కుపోయింది. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా గాలం రాకపోవడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు గాలం తీయడం కష్టతరమని భావించి తిరుపతికి రెఫర్‌ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement