ఏఎస్పీ విభూ కృష్ణ
ప్రొద్దుటూరు కల్చరల్ : మహిళలు తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకుని అందులో రాణించాలని ఏఎస్పీ విభూ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జాతీయ స్థాయి తైక్వాండో ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రథమంగా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, దోహదపడుతాయని తెలిపారు. కామెన్ వెల్త్ తైక్వాండో గోల్డ్ మెడలిస్ట్ టూటౌన్ ఎస్‌ఐ మహబూబ్ బాషా మాట్లాడుతూ తాను కూడా తైక్వాండో క్రీడాకారుడినని, క్రీడలు నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. టూటౌన్ సీఐ వంశీనాథ్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్ మాట్లాడారు. పోటీలను నిర్వహిస్తున్న ఆర్గనైజర్ సలీంను అభినందించారు. ఈ పోటీల్లో 14 రాష్ట్రాలకు చెందిన 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, నటరాజ కళాక్షేత్రం విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో యూత్ తైక్వాండో అసిసోయేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, ఎస్‌ఏఐ కోచ్ సోమేశ్వరరావు, యూత్ తైక్వాండో అసోసియేషన్ ఏపీ చైర్మన్ మోహన్ కృష్ణ, తెలంగాణ చైర్మన్ రమేష్, మెంబర్ రాంబాబు, సీనియర్ కోచ్ మాస్టర్ ఉదయ్, మై స్పేస్ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ మహబూబ్ బాషా, కోచ్ హరి, ఏపీ యూత్ తైక్వాండో అసోసియేషన్ వైస్ చైర్మన్ రామకృష్ణ, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.


