మాస్కులు ధరించి..రాడ్లతో దాడి చేసి.. | - | Sakshi
Sakshi News home page

మాస్కులు ధరించి..రాడ్లతో దాడి చేసి..

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

వేముల: తుమ్మలపల్లె యూసీఐఎల్‌ కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగిపై గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మాస్కులు ధరించిన కొంతమంది దారిలో కాపుకాచి ఇనుప రాడ్లతో ఉద్యోగి సుగునాథరెడ్డిని చితకబాదారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామానికి చెందిన బొగ్గుల సుగునాథరెడ్డి తుమ్మలపల్లె యూసీఐఎల్‌ కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే యురేనియం ఎంప్లాయీస్‌ యూనియన్‌లో జనరల్‌ సెక్రటరీగా కొనసాగుతున్నాడు. ప్రతిరోజు గ్రామం నుంచి బైకుపై విధులకు వెళ్లేవాడు. గురువారం ఉదయం విధులకు బయలుదేరాడు. చిన్నరంగాపురం రింగ్‌ రోడ్డులోకి రాగానే ఇద్దరు వ్యక్తులు బజాజ్‌ ఎన్‌ఎస్‌ వైట్‌ కలర్‌ బైకులో వచ్చారు. ముఖానికి మాస్కులు వేసుకున్నారు. రోజు మాదిరిగానే బెస్తవారిపల్లె క్రాస్‌ నుంచి యురేనియం క్వార్టర్స్‌ దాటగానే ఎల్‌.దివేంద్రారెడ్డి తోట దగ్గర దాక్కొని ఉన్న ఇద్దరు వ్యక్తులు రాడ్లు తీసుకుని ఉన్నారు. అక్కడికి రాగానే వచ్చినాడు రా అంటూ కుడివైపు ఉన్న వ్యక్తి సుమారు 5 అడుగుల ఇనుప రాడ్డుతో ఛాతిపై బలంగా కొట్టాడు. భయపడిన సుగునాథరెడ్డి అలాగే యూసీఐఎల్‌ దారిలోకి వెళుతుండగా మరొక చోట పురుషోత్తమరెడ్డి తోట దగ్గర కాపు కాచుకుని ఉన్న వ్యక్తులు ఎడమ చేతిపై కొట్టారు. అప్పుడు బైకు అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇంతలో రింగ్‌ రోడ్డులో కనిపించిన ఇద్దరు వ్యక్తులు, అలాగే మొదట దాడి చేసిన వారు వచ్చి శ్రీనాథరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డిల మీద తిరగబడే మొనగాడివా రా అంటూ చంపడానికి మూడు నెలల నుంచి కాపు కాస్తున్నామని, ఈ రోజు దొరికినావు అంటూ మోకాలిపైన, కాలిపైన బలంగా కొడుతుండగా.. మబ్బుచింతలపల్లె వైపు నుంచి విజయశేఖరరెడ్డి, జనార్థన్‌రెడ్డిలు రావడం చూసి పారిపోయారు. గాయపడిన సుగునాథరెడ్డి జనార్థన్‌రెడ్డి ద్వారా గంగాధరకు ఫోన్‌ చేయించి అంబులెన్స్‌లో పులివెందుల ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్‌ చికిత్స చేసిన అనంతరం పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో పోలీసులు పులివెందుల ఆసుపత్రికి చేరుకుని దాడి సంఘటనపై విచారించారు. మబ్బుచింతలపల్లెకు చెందిన సి.శ్రీనాథరెడ్డి, టి.భరత్‌కుమార్‌రెడ్డిలతో పాత గొడవలు ఉండేవని, వారు నాపై కక్ష పెంచుకుని మాస్కులు వేసుకుని రాడ్లతో తీవ్రంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు సుగునాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన సుగునాథరెడ్డిని చికిత్స నిమిత్తం పులివెందులలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న పులివెందుల మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వేముల మండల ఇన్‌చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, వేముల జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు.

● ఈ సంఘటనకు సంబంధించి బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు

గాయపడిన యూసీఐఎల్‌ ఉద్యోగి సుగునాథరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement