రాజుపాళెం: రాజుపాళెం మండలంలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి మండలంలోని కూలూరు, గాదెగూడూరు, టంగుటూరు, గోపాయపల్లె గ్రామాల్లో 14 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ శాఖకు సుమారు 70 వేల రూపాయల నష్టం వాటిల్లింది. కరెంట్ లైన్లు తెగిపోవడంతో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మండలంలోని పలు గ్రామాలు చిమ్మచీకట్లోనే ఉండిపోయాయి. మండలంలో 9.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
కొట్టాలలో నష్టం.. కొట్టాల గ్రామంలో ఈదురు గాలుల తీవ్రతకు ఓ ఇంటిపై ఉన్న రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపోగా, నిలిపి ఉంచిన ఒక బొలెరో వాహనంపై భారీ చెట్టు విరిగిపడింది.


