కడప అగ్రికల్చర్: జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సాగు అచ్చి రావడం లేదు. పంటలు పెట్టి నష్టపోవడం, పెట్టుబడి దక్కకపోవడం, మరోవైపు వర్షాభావం, కరువు పరిస్థితులు..అన్నదాతలను కష్టాల్లోకి నెడుతున్నాయి. గడచిన నాలుగేళ్లలో రెండేళ్లు కరువు పరిస్థితులు రైతుల నెత్తిన కష్టాలు మిగిల్చాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పైసా ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రస్తుత ఖరీఫ్‌ను ఎల్‌నినో తరుముకొస్తోంది. దారుణమైన వర్షభావ పరిస్థితులు నెలకొనబోతున్నాయి. గతంలో ఖరీఫ్ సమయంలో కొంతమేర పంటలైనా సాగయ్యేవి. ఈ ఎల్‌నినో పంటలసాగుపై ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఎల్ నినో కారణంగా వర్షాలు కురవకుండా దుర్భిక్షమైన పరిస్థితి నెలకొనబోతోందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
అదునులో వర్షం ఉండదు
ఖరీఫ్ పంటలు సాగు చేయాలంటే జూన్–జూలై మధ్య మంచి వర్షాలు కురవాలి. వాణిజ్య పంట వేరుశనగ సాగుకు జూలై 15 ఆఖరు. మిగతా పంటలు ఆగస్టు దాకా విత్తడం జరుగుతుంది. ఆ తర్వాత అదును దాటితే పంటలు పెట్టడానికి ఆస్కారం ఉండదు. అయితే ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి ముఖ్యమైన జూన్, జూలై నెలల్లో వర్షాలు ఉండవని వాతావరణ శాఖ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ రెండు నెలల్లో 20 నుంచి 40 శాతం మేర వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన 60 శాతానికి పైగా వర్షపాతం లోటు ఉంటుంది. వర్షపాత లోటుతో పంటలు పెట్టడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు కావడం కష్టమే. ఆగస్టులో సాధారణ వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఆగష్టులో వర్షాలు కురిస్తే వేరుశనగ కాకుండా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతుల ముందుకు రావచ్చు. సాధారణ వర్షం కూడా కురువకపోతే పంటలు పెట్టడం అసాధ్యమే.
సన్నగిల్లుతున్న ఆశలు
జిల్లాను కరువులు, ఎల్‌నినో వెంటాడుతున్నాయి. 2024లో, 2025లో పదుల సంఖ్యలో మండలాలు కరువుబారిన పడ్డాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఎల్‌నినో వల్ల జిల్లా మొత్తం ప్రభావితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆగస్టులో సాధారణ వర్షం కురిసినప్పటికీ రైతులు సాగుకు ఆసక్తి చూపకపోవచ్చు.
వ్యవసాయశాఖ సన్నద్దం
ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉంటుందని వాతారణశాఖ నుంచి వ్యవసాయశాఖకు వివరాలు అందినప్పటికి అధికారులు ఖరీఫ్ సాగు ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగతో పాటు వివిధ పంటల సాగుకు సంబంధించిన విత్తనాల పంపీణీ, ఎరువుల నిల్వలపై చర్యలు చేపట్టింది.
మొదలుకాని పనులు
సాధారణంగా ఏప్రిల్ మూడోవారం నుంచి రైతులు ఖరీఫ్ సేద్యం పనులు ప్రారంభిస్తారు. పొలాల్లో కలుపులు తీసి, దుక్కులు దున్నుతారు. వర్షాలు కురిశాక మరోసారి దుక్కులు దున్ని తర్వాత విత్తనం విత్తుతారు. అయితే వర్షాలు లేకపోవడం వల్ల మే నెల మూడో వారం దాటుతున్నా ఇంతవరకు పొలం పనులు చేపట్టలేదు.
ఈ ఏడాది వర్షాధార పంటల సాగు లేనట్టే
జూలై ఆఖరి వరకు వర్షాలు లేవు
పంటలు కూడా విత్తే పరిస్థితి లేదు
ఐదేళ్లుగా రైతులకు అచ్చిరాని ఖరీఫ్ సాగు
ఈ ఏడాది ఖరీఫ్‌సాగుపై ఎల్‌నినో పడగ విప్పుతోంది. పైగా కూటమి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి రైతులకు సాగు భారంగా మారింది. పంటల బీమా కట్టినా ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదు. గతేడాది మోంథా తుపాన్ల వల్ల జిల్లాలలో వేలాది పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు.


