పులివెందుల: అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.47వేల కోట్లు అప్పులు చేసిందని, మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలోనే రూ.4 లక్షల కోట్ల అప్పులు కూడబెట్టిందని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు అందించడం లేదని ఎంపీ ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీని, ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి మహిళల ఉచిత బస్సు పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతోందని, అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం రూ.5వేల కోట్లు కేటాయిస్తే ఈ కాలేజీలన్నీ పూర్తవుతాయన్నారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి.. ఇప్పుడు ఎల్లో మీడియా సాయంతో భ్రమలు కల్పిస్తూ పాలన సాగిస్తోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడానికే పరిమితమైందని, ప్రజలు వీరికి త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
చంద్రబాబుపై కడప ఎంపీ
వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శ


