‘పచ్చ’స్వామ్యం! | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’స్వామ్యం!

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

సాక్షి ప్రతినిధి, కడప : ప్రజాస్వామ్యం పచ్చస్వామ్యమైంది. అధికార పార్టీ నేతల చలువ లేకుంటే దేవుళ్లు బ్రహ్మోత్సవాలకు సైతం ఆటంకాలు తప్పడం లేదు. వైరిపక్షమంటే పోలీసు అధికారుల ద్వారా నియంత్రిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం ఆటంకాలు తప్పడం లేదు. మునుపెన్నడూ లేని దుస్థితి ఈమారు వైఎస్సార్‌ కడప జిల్లాలో తెరపైకి వచ్చింది. బి.మఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు పోలీసు పహారాలో చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని రీతిలో నియంత్రించారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేస్తే జీ.. హుజూర్‌ అనడం మినహా, పోలీసు అధికారులు సర్దిజెప్పే యత్నం చేపట్టడం లేదు. అదేమంటే లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ వచ్చే అవకాశం ఉందంటూ.. కట్టడి చేసే చర్యలకు దిగుతున్నారు. బ్రహ్మంగారిమఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీ సీతారామ అభయ వీరాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గడిచిన 36 ఏళ్లుగా చేశారు. 37వ సారి ఈ ఏడాది కూడా ఈ నెల 12 నుంచి 19 వరకూ కొనసాగాయి. రోజుకొక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్లకు అడ్డుతగిలే చర్యలకు తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈక్రమంలో 12న క్రికెట్‌ పోటీలకు అడ్డుకునే యత్నం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రికెట్‌ పోటీలను అడ్డుకోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడంతో తలోగ్గారు. ఆపై కోలాటం, భజన కార్యక్రమాలకు కూడా ఆటంకం కల్గించే యత్నం చేశారు. చివరి రోజున మంగళవారం వృషభరాజములచే బలప్రదర్శన పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఆ ఒక్కటైనా అడ్డుకోవాలని తెలుగుతమ్ముళ్లు పంతం పట్టి పోలీసుల అధికారుల ద్వారా బలప్రదర్శన పోటీలు అడ్డుకోవడం గమనార్హం.

పోలీసు అధికారులతో పహారా..

వృషభరాజముల బలప్రదర్శన అడ్డుకొని తీరాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఒత్తిడితో పోలీసు అధికారులు మంగళవారం బోడపాడు గ్రామంలో పహారా కాశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచే ముగ్గురు ఎస్‌ఐలు, సుమారు 50 మంది పోలీసులు గ్రామంలో తిష్టవేసి పోటీలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. పోటీలో పాల్గొనేందుకు బోడపాడు గ్రామంలోకి ఎద్దులను రాకుండా పొలిమేరల్లోనే అడ్డుకోసాగారు. అదేమంటే పర్మిషన్‌ లేదు, ఎలా బండలాడుగు పోటీలు ఏర్పాటు చేస్తారు, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. కాగా, ఆదే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఈనెల 13న హనుమాన్‌ జయంతి కార్యక్రమంలో భాగంగా చాపాడు మండలం విశ్వనాథపురంలో బండలాడుగుడు పోటీలు ప్రారంభించారు. చట్టం అధికార పార్టీకి చుట్టం కాకపోతే బండలాడుగు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌పై కేసు నమోదు చేయాలి కదా? అని బోడపాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బోడపాడు గ్రామంలోనే కావాలనే ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌ బండలాగుడు పోటీలు పోలీసుల ద్వారా అడ్డగించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. 36 ఏళ్లుగా ఎప్పుడు లేని ఆటంకం ఈమారు కల్గించారని, దేవుని కార్యక్రమంలో కూడా రాజకీయాలేమిటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుళ్ల ఉత్సవాల్లో వింత రాజకీయం

బోడపాడు గ్రామంలో పోలీసుల ఆంక్షలు

ఎద్దుల బలప్రదర్శనకు ఆటంకాలు

ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌పై

మండిపడుతున్న గ్రామస్తులు

Advertisement
 
Advertisement
Advertisement