ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరుకు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు.. క్రికెట్ బెట్టింగ్, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాల నుంచి యువతకు విముక్తి లభిస్తుందని.. ఇక అసాంఘిక శక్తులకు బడితె పూజ తప్పదని పట్టణ వాసులు భావించారు. ఇందుకు తగ్గట్టుగానే ఏఎస్పీ విభూకృష్ణ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కాక ముందు నుంచే క్రికెట్ బుకీలు, మట్కా రాసే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి తనదైన స్టైల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సబ్‌డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్రికెట్ పందేలు, బుకీల కదలికలు, వారిని ఎలా పట్టుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైనా క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం వచ్చిన వెంటనే ఆయా స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలతో కలిసి ఏఎస్పీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌లో ఎంతో కాలంగా యువతను పట్టిపీడిస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు ముగింపు పలకాలని కృతనిశ్చయంతో ఉన్న ఏఎస్పీ ఆదేశాలను కొందరు పోలీసు అధికారులు ఖాతరు చేయడం లేదు. సమష్టి కృషితో బెట్టింగ్ డాన్‌ల ఆగడాలకు చెక్ పెడదామని ‘కొండ’ంత ఆశ పెట్టుకున్న ఏఎస్పీకి తమ ‘మధు’రమైన మాటలతో కొందరు సీఐలు, ఎస్‌ఐలు బురిడీ కొట్టిస్తున్నారు. దాడుల పేరుతో బుకీలను పట్టుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్ల వ్యవహారం సాగిస్తున్నారు.
ఏం చేసినా తన వద్ద డబ్బులు లేవని చెప్పిన బుకీ
ఇటీవల వేంపల్లెకు చెందిన ఒక క్రికెట్ బుకీతో ఓ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి పెద్ద మొత్తంలో సెటిల్‌మెంట్ కుదుర్చుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న జిన్నారోడ్డుకు చెందిన క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో కొన్ని రోజుల క్రితం ఒక ఎస్‌ఐ వేంపల్లెకు వెళ్లాడు. అక్కడి పేరు మోసిన క్రికెట్ బుకీని అదుపులోకి తీసుకున్నాడు. ప్రొద్దుటూరు నుంచి వేంపల్లెకు వచ్చే వరకు దారి వెంట సదరు బుకీని బెదిరిస్తూ, బుజ్జగిస్తూ బేరం కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గండిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాన్ని నిలుపుకొని రూ. 20 లక్షలు ఇస్తే ఇట్టే వదిలేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది ఎంత బెదిరించినా తన వద్ద డబ్బులు లేవని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని భీష్మించుకొని కూర్చున్నాడు క్రికెట్ ఆ బుకీ. అక్కడి నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు శివారులో వాహనాన్ని ఆపుకొని చివరగా రూ.10 లక్షలు అయినా ఇవ్వాలని అడిగినా అతను లేదని చెప్పడంతో ఇక చేసేదేమి లేక స్టేషన్‌కు తీసుకెళ్లారు. చివరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఒక వ్యక్తి ద్వారా సెటిల్‌మెంట్ వ్యవహారం నడిపించి క్రికెట్ బుకీ పెద్ద మొత్తంలో పోలీసు అధికారులకు సమర్పించుకొని వెళ్లిపోయినట్లు పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేగాక బుకీతో సంబంధాలున్న జిన్నా రోడ్డుకు చెందిన ముగ్గురు క్రికెట్ బుకీలను స్టేషన్ అధికారులు పిలిపించి బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతోందా లేక వాళ్లకు తెలియకుండా స్టేషన్ పరిధిలోనే సెటిల్‌మెంట్‌ల దందా కొనసాగిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ కొందరు పోలీసు అధికారులకు కాసుల పంట కురిపిస్తోంది.
వన్‌టౌన్‌లో ఐడీ పార్టీ ఔట్
ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఐడీ పార్టీని రద్దు చేశారు. వరుస వివాదాల నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్‌కు సంబంధించిన కొందరు పోలీసు అధికారులపై ఇటీవల పత్రికల్లో వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో ఐడీపార్టీని రద్దు చేసినట్లు సమాచారం. స్టేషన్‌లోని విషయాలు బయటికి ఎలా వెళ్తున్నాయని పోలీసు అధికారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
క్రికెట్ బుకీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దారి వెంట బెదిరింపులు, బుజ్జగింపులు
రూ.20 లక్షలు ఇచ్చి వెళ్లిపోవచ్చన్న ఎస్‌ఐ
చివరికి ఉన్నతాధికారికి
తెలియకుండా సెటిల్‌మెంట్


