బి.కోడూరు : మండలంలోని సగిలేరు డ్యాం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తువ్వపల్లె గ్రామానికి చెందిన సాకం ఈశ్వర్‌రెడ్డి (46) దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఈశ్వర్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంలో ఓ పని నిమిత్తం పోరుమామిళ్లకు వెళుతుండగా.. సగిలేరు డ్యాం వద్ద పోరుమామిళ్ల నుంచి మైదుకూరుకు కూలీలతో బొలెరో వాహనం వస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి గ్రామపంచాయతీ ఎర్రమాసుపల్లె గ్రామానికి చెందిన చిన్న రామయ్య (60) అనే ఉపాధి కూలీ మంగళవారం కొప్పర్తి చెరువు ఫీడర్ కాలువలో ఉపాధి పని చేస్తూ వడదెబ్బకు గురై మృతి చెందాడు. చిన్నరామయ్య ఉపాధి పని చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలడంతో తోటి కూలీలు మాట్లాడించే ప్రయత్నం చేయగా.. ఉలుకు పలుకు లేకపోవడంతో వెనువెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి సాయం కోరి, సమీపంలోని ఆటోను పిలిపించారు. ఆటో ముందుగా రావడంతో కడప నగరంలోని ఓ ప్రైవేటు వైద్యాశాలకు చిన్నరామయ్యను తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకొని ప్రైవేటు వైద్యశాల వద్దకు ఎంపీడీఓ కుల్లాయిబాబు, ఏపీఓ రామాంజులరెడ్డి చేరుకొని మృతుడిని పరిశీలించి, తోటి కూలీలు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి వారసులకు ఉపాధి హామీ చట్టం ప్రకారం రెండు లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందని ఎంపీడీఓ కుళ్లాయిబాబు తెలిపారు.
పోలీసు కస్టడీకి
నిత్యానందరెడ్డి
కడప అర్బన్ : పెద్ద దస్తగిరి హత్య కేసులో నేరారోపణలను ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని దర్యాప్తు అధికారి, ప్రస్తుత చిన్నచౌక్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మొదట ఆయనను కడప కేంద్రకారాగారం నుంచి కడప రిమ్స్‌కు తీసుకుని వచ్చి వైద్యపరీక్షలను చేయించారు. తరువాత కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి విచారణ చేస్తున్నారు.


