కదలని జొన్నలు.. ఆగని కన్నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

కదలని జొన్నలు.. ఆగని కన్నీళ్లు!

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

కడప సెవెన్‌రోడ్స్‌: కనీస మద్దతు ధరకు రైతుల నుంచి సేకరించిన జొన్న తరలించడంలో పౌరసరఫరాల సంస్థ తీవ్ర అలసత్వం వహిస్తోంది. రవాణాకు లారీలు లేవంటూ నిర్లక్ష్యపు సమాధానాన్ని చెబుతోంది. కాటా వేసి బస్తాలకెక్కిన జొన్నలు ఇళ్లల్లో, కళ్లాల్లో మగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిల్‌ సప్లయ్స్‌ జిల్లా మేనేజర్‌ నాగ సుధ తమ గోడు వినే పరిస్థితిలో లేదని వాపోతున్నారు. లారీల యజమానుల నుంచి కమీషన్లు తేలకపోవడం వల్లే రవాణా విషయంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో చెన్నూ రు మండలానికి చెందిన కొందరు రైతులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. సివిల్‌ సప్లయ్స్‌ డీఎం తన తీరు మార్చుకుని జొన్నలు తరలించేందుకు తక్షణమే వాహనాలు ఏర్పాటు చేయకపోతే ఆమె కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరిరెడ్డి హెచ్చరించారు.

● 2025–26 రబీలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు తెల్లజొన్న సాగు చేశారు. వరిలో నష్టపోతున్నామని భావించిన కేసీ కెనాల్‌ రైతులు సైతం కొన్ని ప్రాంతాల్లో జొన్నసాగువైపు మళ్లారు. ఈ యేడు రబీలో అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో అరకొర దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. ఆ అరకొర పంటను కొనడానికీ ఫ్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోంది.

ఎంఎస్‌పీతో కొనుగోలు కేంద్రాలు

ఆలస్యంగానైనా ప్రభుత్వం క్వింటాలుకు రూ.3699ల కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో 20 జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పౌరసరఫరాలసంస్థ అధికారులే సంచులు సరఫరా చేయడంతో పాటు రైతుల వద్దే కాటా వేయించి బస్తాలను అక్కడే వదిలి వెళ్లారు. సేకరించిన జొన్న 20 రోజుల పైబడి రైతుల ఇళ్లల్లో, కళ్లాల్లో అలాగే ఉన్నాయి. పౌరసరఫరాల అధికారులు సేకరించిన జొన్నలకు రైతులకు రశీదులు ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు లెక్క. పౌరసరఫరా అధికారులు రశీదులు ఇవ్వక.. జొన్నలు తరలించక రైతులతో ఆటలాడుతున్నారు.

రవాణాకు లారీలు కరువు

పౌరసరఫరాల డీఎం పలకడం బరువు

ఆదుకోండంటూ రైతుల ఏకరువు

Advertisement
 
Advertisement
Advertisement